బస్టాండ్ లో బస్సు రావడానికి ఇంకా సమయం ఉంది రిజర్వేషన్ చేయించుకున్న బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడే బొమ్మలా ఉన్న ఐదారేళ్ల పాప వాళ్ళ నాన్న ఒళ్లో నుంచి దిగి నా ముందర నుంచి వెళుతున్న పాపతో నీ పేరేంటమ్మా అని అడిగాను
దానికి వెంటనే ఆ పాప నోటి నుంచి ' నీ కెందుకే ముండ ' అన్న మాట వినబడగానే నాకు ఏమనాలో ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు.. అంతలో వాళ్ళ నాన్నగారు అనుకుంటా సారీ అండీ అంటూ రెండు పదాలు చెప్పీ చెప్పకముందే కొంచెం దూరం నుంచి గట్టిగా మరో స్వరం వినిపించింది 'ఆడ ముండ 'తో మాటలు ఏంటి అని... ఆ మాటలు వినగానే ఎందుకో చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల అయిపోయింది నా పరిస్థితి.....
అంతలో వచ్చిన విజయవాడ బస్సు కనిపించగానే బయలుదేరడానికి ఇంకా సమయం ఉన్నా కూడా వెంటనే బస్సు ఎక్కి కూర్చున్నాను.. నాతోపాటు ఒకరో ఇద్దరో ఎక్కారు .. బయల్దేరడానికి ఇంకో అరగంట ఉంది..
బయల్దేరడానికి ఇంకా సమయం ఉన్నా డ్రైవరు పదినిమిషాలకే వచ్చి కూర్చోవడంతో అందరు హడావిడిగా బస్సు ఎక్కడం మొదలెట్టారు..
చూస్తుండగానే ఆ ఫ్యామిలీ కూడా ఇదే బస్సు ఎక్కడానికి వస్తున్నారు.. ఎందుకో నా మనసంతా కుంచించుకు పోయింది ..పోతే పోయింది రిజర్వేషన్ వదిలేసుకుని ఇంకో బస్సు ఎక్కుదామా అన్నంతగా నా మనస్సు ఆరాట పడిపోయింది.
వాళ్ళు బస్సు ఎక్కి తమ సీట్లు దగ్గరికి వెళుతూ ఉండగా వారి ముందు ఒక పెద్దావిడ తన సీటు దగ్గర సామాను సర్దుతూ ఉంది.. పెద్దావిడ దగ్గరికి రాగానే పాప ఆమెను తోసినట్టుగా అంటూ 'జరగవే ముండా ' అంది.. ఆ పాప అలా అనగానే వాళ్ళ నాన్న వెనకనుంచి 'సారి 'చెప్పడానికి నోరు తెరిచే లోపలే.. ఆ పెద్దావిడ పాప చెంప చెల్లు మనిపించింది.. పెద్దగా రాగం తీస్తున్న పిల్లను ఏంటి అడ్డమైన మాటలు మాట్లాడేది కాకుండా ఏడుపు కూడానా అంటూ గట్టిగా గదమాయించింది... దాంతో పిల్ల గొంతులోనే ఏడుపుతో వెక్కుతుంది....బుద్ధి లేదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా.. బాగా అలవాటు అయిన మాట లాగా ఉంది.. అసలు మీ అమ్మ నాన్న ఎక్కడ ??ఈ దెబ్బ వాళ్లకు పడాలి అంటూ గట్టిగా అరవడం కొనసాగించింది.
ఇంత జరుగుతున్నా క్షమాపణ అడిగే నాన్న కానీ నాన్నని గదమాయించే అమ్మ గాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్సబ్దంగా తమ సీట్లో వెళ్లి కూర్చున్నారు.. బస్సులో వాళ్లంతా ఆ పెద్దావిడ మాటలకి ఏం జరిగిందో ..తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు ..తెలిసిన వాళ్ళ పక్క వాళ్ళ చెప్తూ ఉన్నారు...
ఆ పాప ఫ్యామిలీ మాత్రం అక్కడ మొదలెట్టిన మౌనాన్ని విజయవాడ వరకు కొనసాగించారు... విజయవాడ బస్టాండ్ కంటే ముందుగానే వాళ్లు దిగుతింటే...ఎందుకో నా పక్క నుంచి వెళుతున్న పాపను మరోసారి 'నీ పేరేంటి పాప ' అని అడగాలని ఎంతో అనిపించింది... ఇప్పుడు పాప ని చూస్తుంటే తప్పు తెలియకుండా శిక్షను అనుభవిస్తున్న ఖైదీలా అనిపించింది.... ఇంతకు పాప పేరేంటో????