అభిషిక్తం

"బాబూ...శంకరం.

నువ్వు పరీక్షలకు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. నాన్న ఆరోగ్యం బాగాలేదు. ముఖ్యంగా చెప్పేదేమిటంటే నాలుగు రోజుల క్రితం మన గుర్రం కాలు విరిగింది. ఆచార్యుల వారు కట్టుకట్టారు. కాని ఫలితం లేదు. అది బ్రతకాలంటే కాలు పూర్తిగా తీసేయాలట. రేపటి గురించి బాధ కన్నా నిన్నటి వరకు మనకు తోడుగా నిలిచిన గుర్రం కొట్టంలో తిండీ, నీరు ముట్టకుండా పడివుంటే, కడుపులో దేవేస్తుందిరా...బాబూ....ఆ గుర్రం విలువ ఇప్పుడు మరీ తెలుసొస్తుంది. నీవు ఇవేమీ మనసులో పెట్టుకోకు, బాగా చదువుకో, మీ నాన్నగారు నీకు ఏ లోటూ రాకుండా డబ్బులు పంపిస్తారులే. ఉత్తరాలు రాస్తుండు. పరీక్షలు బాగా వ్రాయి....

ఆశిస్సులతో....
మీ అమ్మ."

శంకరం ఆ ఉత్తరాన్ని చదివి నిస్త్రాణగా వుండిపోయాడు.
అతని కళ్ళముందో నల్లని గుర్రం చెంగుచెంగున దూకుతూ కనపడింది.
మూడు సంవత్సరాలనుంచీ అదే తమని పోషిస్తుంది. తమది చాల చిన్నా ఊరు. తన తండ్రి బండి ఒకటే ఆ ఊళ్ళో తిరిగేది. శంకరం బుగ్గలమీద నీటిని తుడుచుకున్నాడు. అతడి మనసంతా వికలమైపోయింది. ఆ రోజు చదువు మీద మనసు నిలవలేదు.

15 రోజుల గడిచాయి. పరీక్షలు వ్రాసి, ఊరు వెళ్ళాడు. అక్కడ తండ్రికి కరణంగారు తన దగ్గరే ఉద్యోగం వేయించారు. బండిని వడ్రంగి మేస్త్రికి అమ్మేసారు. అంతా బాగానే ఉంది. మరీ గుర్రం.....? శంకరం కొట్టంలోకి వడివడిగా వెళ్ళాడు. అక్కడుంది గుర్రం. మూడుకాళ్ళు ముడుచుకుని, ఒక కాలు మాత్రం నిటారుగా చాపుకుని ప్రక్కకు పడి ఉంది. దాని దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కళ్లు తెరవడానికి కూడా ఒపికలేనట్టు అలాగే పడివుంది. ఆ ఇంటి లేమి, ఆ గుర్రపుశాలలో కూడా కనపడుతుంది. ఒక్క గడ్డి పరక కూడా లేదు.

ఒక చెట్టు కొట్టేయగానే దాన్ని అల్లుకున్న లత మరో ఆధారాన్ని చూసుకుని తన బ్రతుకు నిలుపుకుంటుంది. పడిపోయిన చెట్టు మాత్రం కృంగి   కృశించిపోతుంది. ఇపుడు ఆ గుర్రం అలాగే పడివుంది. కుటుంబం మాత్రం మరో జీవనాధారం చూసుకుంది. శంకరం నిశ్శబ్దంగా అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు.
పట్నం రాగానే ఆ ట్రస్ట్ గురించి వాకబు చేసాడు. ఆ అడ్రస్ పట్టుకొని అక్కడకు వెళ్ళాడు. అది ఒక భవంతి. ఒక మూల వడ్రంగి పని జరుగుతున్నది. మరోవైపు ఇనుపరేకుల్ని కాల్చి గుండ్రంగా  రూపుదిద్దుతున్నారు. శంకరం లోపల గదిలోకి ప్రవేశించాడు. డాక్టర్ భరద్వాజ...'నేను మీకేం చేయగలను....?' అన్నట్టు చూసాడు.

"ఒక కృత్రిమ కాలు కావాలి సార్" అన్నాడు శంకరం.
"మేము ఉన్నదే అందుకు" అన్నట్లు నవ్వాడు భరద్వాజ.
శంకరం కొద్దిగా తటపటాయించి "ఎంతవుతుంది డాక్టర్ గారు...?" అని అడిగాడు.
'అది అమర్చవలసిన కాలుని బట్టి వుంటుంది. అయుదారువేల దాకా కావొచ్చు' అన్నాడు డాక్టర్.
శంకరం అంత ధర ఉహించలేదు. శంకరం మొహం వాడిపోయింది. దిగులుగా కుర్చిలోనుంచి లేచాడు .
"నా దగ్గర అంత డబ్బు లేదు సార్" అన్నాడు. "ఎంతుంది ...?" సానుభూతిగా అడిగాడు డాక్టర్ భరద్వాజ.
"నూట డబ్బై అయిదు రూపాయలు. నా స్కాలర్ షిప్ అది."
డాక్టర్ తన ఆశ్చర్యాన్ని అణచుకుంటూ, "ఇంతకీ కాలు ఎవరికీ అమర్చాలి?" అనడిగాడు.
"మా...గుర్రానికి".
డాక్టర్ తలమునకలయ్యేంత ఆశ్చర్యంతో "గు...ర్రా...నికా" అన్నాడు.
శంకరం జరిగిందంతా చెప్పాడు. చెపుతుంటే  అతడి కళ్ళు తడి అయ్యాయి. డాక్టర్ కూడా బాగా కదిలిపోయినట్లు కనిపించాడు. కుర్చీ లోంచి లేచి శంకరం దగ్గరకు వచ్చి భుజం మీద చేయివేసి. "నేను నీకు ఉచితంగా ఒక కృత్రిమ కాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను" అన్నాడు.శంకరం ఆనందంతో డాక్టర్ కి  నమస్కారం చేసి బయటకు వచ్చాడు. మనుషులనే కాకుండా జంతువులను ప్రేమించిన ఆ కుర్రవాడి ఆశయం తమ ట్రస్ట్ వారి ఆశయం కన్నా గొప్పది అన్నట్టుగా తోచింది భరద్వాజకు ఆ  క్షణం.
శంకరం తమ పల్లెకు చేరేసరికి చాలా రాత్రి అయింది...ఆ రాత్రి నిద్రపోలేదు. ఒంటిగంట అవుతుండగా కొట్టంలో కొచ్చాడు. శంకరం నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి దాని కాలుకి తను తెచ్చిన కృత్రిమ కాలు తొడిగాడు.వీపుకు బెల్ట్ లు అమర్చి అతి కష్టం మీద దాన్ని లేపాడు.అది బాధగా లేచి రెండడుగులు వేసింది.

శంకరం కళ్ళు సంతోషంతో కలువ పూలయ్యాయి. గుర్రం మెడ మీద ప్రేమగా నిమిరాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఊరిబయట కొచ్చారు.
ముందు అతడు...వెనకే అతడిని అనుసరిస్తూ గుర్రం....ఊరికి కొద్ది దూరంలో చుట్టూ కొండలు. మధ్యలో సెలయేరు, పచ్చిక బయళ్ళు వున్నాయి. పచ్చగడ్డి  చూడగానే గుర్రం ఆత్రంగా పరకలని తినసాగింది. గుర్రం నెమ్మది నెమ్మదిగా కొండలవైపు సాగిపోయింది. శంకరం ఇంకా అలాగే నిలబడి వున్నాడు.
గుర్రం ఇప్పుడు స్వేచ్చాజీవి.
అడవుల్లో మిగతా జంతువులలాగే అది బ్రతుకుతుంది.
కొండమలుపులో గుర్రం అదృశ్యమవటాన్ని శంకరం చూస్తూ ఉన్నాడు
సెలయేరు..., పచ్చిక బయళ్ళు... దూరపుకొండలు ..వెన్నెల...అన్ని అతన్ని ఆశీర్వచనాలతో అభిషిక్తుడ్ని చేస్తున్నట్లు చూస్తున్నాయి.



"ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్" యండమూరి పాతికేళ్ళ రచన వ్యాసంగంలో అత్యుత్తమమైన కథల సంకలనం.(1969 - 94 ).....ఇందులో 25 కథలు ఉన్నాయి... అందులో ప్రతి కథ ...అందాల పూవే...దేని అందం దానిదే...ఈ పుస్తకం చదివాక ఇలాంటిది మరొకటి యండమూరి గారి నుంచి రాలేదా అంటూ వెతుక్కోక మానరు...అందులోని ఒక చిన్న కథే ఈ . "అభిషిక్తం" మీ కోసం...
 
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!