రవీంద్రనాథ్ ఠాగూర్ .. పద్మపూజ.... చిన్న కథ

 

విశ్వకవి రవీంద్రుడు రచించిన కథలు `పద్మపూజ’ పుస్తకంగా 1959లో తొలిముద్రణ అయింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన, పద్మపూజ కథలు సంపుటిని తెలుగులో కె.వి.రమణారెడ్డి అనువదించారు... పద్మపూజ కథల సంపుటి మొదటి ముద్రణ జులై ,1959 లో, తిరిగి ద్వితీయ ముద్రణ 1988 లో గావింపబడినది. ఇందులో 32 చిన్న కథలు ఉన్నవి... ప్రతీ కథ అందరికి నచ్చేవి,పెద్దలు మేచ్చేవి .. ఈ కథ సంపుటి విడుదలై శతాబ్దం గడిచిన ఇప్పటికాలానికి కూడా అన్ని కథలు గీటురాయి లాంటివే..

32 కథలలో ఒక కథ "పద్మపూజ".. ఆ కథ పేరునే ఈ కథలసంపుటి పేరుగా పెట్టారు...ఇందులోని కథలు వరుసగా...నాకో కథ చెప్పవే, ఆట బొమ్మలు, గుర్రం, విజయఫలం, పెళ్ళి, పద్మపూజ, మోక్షము, తల ఖరీదు, గురుగోవిందుడు, అంతిమ గీతిక, శిక్ష, లక్ష్య సిద్ధి, కార్మికుల స్వర్గాన కళాప్రియుడు, దివి - భువి, నరకంలో మజిలీ, బాట, మసక వెలుగు, రాహువు ప్రణయం, ప్రాణమూ..మనస్సు, భిక్షకుడు, అనంతుడూ -  నిత్యనూతనుడూ, మేఘదూత, తార ఆత్మహత్య, ప్రేతము, స్వర్గాచ్యుతి, రాజకుమారుడు, ఈకె, మీనూ, పేరు, మనసుకెక్కిన రాణి, దేవతా సుందరి, రాక.


విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ .. పద్మపూజ.... చిన్న కథ

క్రూరమైన మంచుతాకిడికి పద్మాలు చాలామట్టుకు చనిపోయినాయి. ఒకే ఒక్కటి కొలనులో ప్రాణాలతో మిగిలివుంది. ఆ కొలను సుదానునిది. సుదాసు తోటమాలి.

ఈ పద్మమును తీసికొని, సుదాసు దాని నమ్ముటకు రాజ మందిరానికి బయలుదేరాడు. రాజమందిర ద్వారమువద్ద అతనికి ఒక వ్యాపారి ఎదురయ్యాడు. ఆ వ్యాపారి ధనికుడు. అతడు పుష్పమును ఎంతో మెచ్చుకొన్నాడు.

" ఈ పువ్వును నేను కొని, బుద్ధునికి అర్పిస్తాను, బుద్ధ భగవానుడు విచ్చేసి వున్నాడు. దీని ఖరీదు ఎంతో చెప్పు," అని వనమాలిని అడిగాడు.

ఒక బంగారు రూకకు సుదాసు దానిని యిస్తానన్నాడు.

ఆ వ్యాపారి, జేబులో చేయిపెట్టి రూకకొరకు తడుముకొంటూ వుండగా,ఇంతలో రాజుగారు మందిరం నుండి వచ్చాడు. ఆయన బుద్ధ భగవానుని దర్శనానికి బయలుదేరాడు.
సుదాసుని చేతనున్న తెల్లని పువ్వుని చూచి, "భగవానుని కొరకు నేను దీనిని కొంటాను. ఖరీదెంత?" అని అడిగాడు.
ఇది వరకే దీనిని వీరికి ఒక బంగారు రూకకు అమ్మివేశాను, ప్రభూ!" అన్నాడు సుదాసు.
"నేను పది బంగారు రూకలిస్తాను గాని, దీనిని నాకు అమ్ము." అన్నాడు రాజు.
"ఇరవై రూకలిస్తాను." అన్నాడు వ్యాపారి,
ఈ తీరున ఆ పువ్వుకొరకు వారు ఒకరితో నొకరు పోటీపడ్డారు. దాని ధర పెరిగిపోయింది.

వనమాలి దీనినంతా విన్నాడు. విని, తనలో "భగవానుని కోసమే కదా, వీరు ఇంత పెచ్చు ధర చెల్లిస్తానంటున్నారు. నేనే పోయి దీనిని బుద్ధభగవానునికి అర్పిస్తే, మరెంత లాభం సంపాదించగలనో," అని అనుకున్నాడు.

"నన్ను క్షమించండి, నేనీ పువ్వును మీకు ఎవ్వరికీ అమ్మదలుచుకోలేదు," అని చేతులు ముకుళించి ప్రార్ధనాపూర్వకంగా సుదాసు చెప్పాడు. వెంటనే వూపిరిసలుపనంత వేగాన పరుగుతీసి, బుద్ధుడు కూర్చొనియున్న చోటు చేరాడు. ఆయన ఎంతో నిశ్చలముగానూ,దివ్యశోభాతోనూ కూర్చుని ఉన్నాడు.
సుదాసు బుద్ధుని చూశాడు. కాని కదలిక లేనట్లు వున్నా చోటనే నుల్చున్నాడు. కొంతసేపటి వరకు అతడు మాటలాడ లేకపోయాడు. చిట్టచివరకు భగవానుని పాదములకు సాష్టాంగపడి పువ్వును అర్పించాడు.
బుద్ధభగవానుని ముఖము చిరునవ్వుతో విప్పారింది. "ఏమి నీ కోరిక ?" , అని సుదాసును ప్రశ్నించాడు.
"తమ పాదధూళిలో ఒక అణువు యిచ్చిన మరేమీ అక్కరలేదు." అని ఆ వనమాలి ప్రార్ధించాడు.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!