ఖదీర్ బాబు-బియాండ్ కాఫీ-కథల సంక్షిప్త వివరణ విశ్లేషణ-పలువురి రివ్యూలు
ఖదీర్ బాబు వ్రాసిన బియాండ్ కాఫీ కథా సంకలనం గురించి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అభిప్రాయం.
ప్రియమైన ఖదీర్ బాబు,
వైజాక్ నుండి వస్తూ ఇప్పుడే మీ పుస్తకం చదివాను. బియాండ్ కాఫీ. రెండు తప్ప అన్ని కథలూ మైండ్ బ్లోయింగ్. నాకు తెలిసినంతవరకూ ఆత్మ ఒంటరితనాన్ని కెలెడోస్కోపులో చూపిన తొలి రచయితవు నువ్వే.
మచ్చ సింబాలిక్ గా అప్పీలింగ్ గా ఉంది.
‘టాక్ టైమ్’ లేడీస్ కొత్త కాదు. ఫోనులో ఇబ్బంది పెడుతున్న వారిపై నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ కేసులు కోర్టులో పెండిగులో ఉన్నాయి. నీ కథలు చదువుతున్నప్పుడు మెటాఫిజికల్ శూన్యం పై వ్రాసిన శామ్యూల్ బాకెట్ మరియు అతని డ్రామా వెయిటింగ్ ఫర్ గోడోట్ మదిలో మెదిలాయి. ఇంకా నేను వ్రాసిన ఆనందో బ్రహ్మ నీ వహీద్ కథ చదువుతున్నప్పుడు గుర్తు వచ్చింది. యూ హేవ్ డన్ ఏ గ్రేట్ జాబ్.
అభినందనలు.
యండమూరి.
ఖదీర్‌బాబు కథల్ని చదవడానికి కష్టపడక్కర్లేదు. చదవడం మొదలుపెడితే చాలు కథే మిమ్మల్ని కడకంటా లాక్కుపోతుంది. ఇక్కడ పది కథలున్నాయి. పది కథల్లోనూ రచయిత పది రకాలుగా కనిపిస్తాడు. సైకో ఎనలిస్టుగా, సైకో థెరపిస్టుగా, రియలిస్టు పెయింటర్‌గా, ఇంప్రషనిస్టుగా, కాఫీ టేబుల్ దగ్గర కథ చెప్పే స్నేహితునిగా, పాఠకుల చేతికి చిక్కి విలవిల్లాడే బాధిత రచయితగా, మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అన్వేషిగా - ఇలా రకరకాలుగా కనిపిస్తాడు.
మూస కథలు రాయడం ఖదీర్‌బాబుకి రాదు. ఈ కథల్లో మీకు ఏమైనా దొరకచ్చుగాని డల్ మూమెంట్స్ మాత్రం మచ్చుకైనా దొరకవు. తినబోతూ రుచి అడగటమెందుకు, నా మాటలు వదిలేసి పక్కనున్న కథాస్రవంతిలో ఈదులాడండి.
- ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్
ఇందులో పది డైరెక్ట్ కథలు (ఏ పత్రికలోనూ అచ్చు కానివి) వున్నాయి. అందులో “వహీద్” కథ ఒక్కటే Odd man out గా వుండిపోతుంది. మిగిలిన కథలన్నీ పోస్ట్ మోడరన్ సిటీలలో జరిగితే ఈ కథ ఒక్కటే నోస్టాల్జిక్‍గా వెనక్కి వెళ్తుంది. కథలో కొంత లిబరల్ అంశం వున్నా అది చాలా పల్చగా వుండటం వల్ల బహుశా ఈ సంకలనంలో వుండదగినది కాదేమో అనిపిస్తుంది. ఆ ఒక్క కారణం తప్పితే కథ బాగానే వుంది. మిగిలిన కథలన్నీ చదవాల్సినంత బాగున్నాయి. మనం బతుకున్న సమాజాన్ని ఒకసారి మనం అద్దంలో చూసుకోవాల్సిన అవసరం వల్ల చదవాలి.
అయితే ఈ కథలు చదివిన తరువాత కొంత అసహ్యం కలగవచ్చు, కొంత అసహనం కలగవచ్చు. నిక్కచ్చిగా నిజం తగిలిన చోట కోపం రావచ్చు. బహుశా రచయిత కోరుకుంది కూడా అదేనేమో..??
- అరిపిరాల సత్యప్రసాద్
ఓ హెన్రీ, మంటోలాంటి వాళ్ళు ఏ విషయాన్నయినా కథగా రాయవచ్చునంటారు. తన సీనియర్లకన్నా అడుగు ముందుకేసి, 'ఒకటేం, పది కథలు రాస్తాన'న్నాడు ఖదీర్.
నాకర్థమైనంతవరకూ యివి ఫేబుల్స్. అంటే నీతి కథలు. పంచతంత్రమైనా, ఈసప్ కథలైనా మానవ స్వభావాలను, మంచి చెడులను allegoricalగా చెప్పినవే. విలువలన్నీ వయ్యక్తికమూ, సాపేక్షమూ అనుకుంటున్న ఈ రోజులకు యివి మోడ్రన్ ఫేబుల్స్. క్లుప్తతను మూల లక్షణంగా పాటించిన ఫేబుల్స్.
- ముక్తవరం పార్థసారథి
ఖదీర్ బాబు కథలపై సంక్షిప్త వివరణ source: http://turupumukka.blogspot.in/2013/08/26.html
బియాండ్ కాఫీ–సాయి పద్మ రివ్యూ (http://thammimoggalu.wordpress.com//)
కొంతమంది దగ్గర కొన్ని అద్భుతాలుంటాయి, వాటితో పాటు కొన్ని అవలక్షణాలు ఉంటాయి … కొన్ని బాలన్స్ అవుతాయి, కొన్ని డబ్బుతో, పవర్తో, మనుషులతో, అధికారంతో కప్పబడిపోతాయి. చక్కగా తయారు అయిన శరీరం వెనుక వొంటరితనం కొంతమందే పట్టుకోగలరు….ఖదీర్ గారి వాక్యం లాంటి ఎక్సరే కి ఆ శక్తి ఉంది.
ఇప్పుడే ‘బియాండ్ కాఫీ ‘ మరియు మరో తొమ్మిది కథల్లాంటి సంఘటనల బుక్ చదివాను. హైదరాబాద్ అనే అన్నం ఎలా ఉడికిందో చెప్పే మెతుకుల బ్రతుకుల సాక్ష్యం తో … సహా .. ! మనసు భారం అవుతుంది … దుర్గా మిట్ట కథల్లోని పిల్లాడి స్వచ్ఛత గుర్తొచ్చి …. కానీ ఏం చేయగలం .. పిల్లాడు పిల్లాడిగానే ఉండిపోడు కదా ( వహీద్ కథ )
లిక్విడ్ మోడర్నిటీ మీద ఆధారం చేసుకొని రాసే నవలికలు, కథలు తెలుగువాళ్ళకి కొత్త … కానీ కాఫ్కా ప్రభావంతో రాస్తున్న హరుకి మురకమీ (Haruki Murakami) లాంటి రచయితలు మోస్ట్ పాపులర్ డార్క్ రైటర్స్. ఖదీర్ కధలు ఒక కొత్త పంధా కి… ఇలాంటి డార్క్ కామెడీ, వొంటరితనపు కథలకి మొదలు అని నాకు అనిపించింది ( నేను చదివినంత వరకూ )
వొంటరితనం కీ ఏకాంతానికి మధ్య ఉండే మానసిక జాడ్యం ఖదీర్ బాబు ఈ కథల సారాంశం … కథల నిండా భయపెట్టే ఆడవాళ్ళు .. వాళ్ళ వొంటరితనం .. ఎవరూ ఎలుగెత్తి అరవరు…వాళ్ళ ఆసక్తి లేని చూపులు, ప్రదర్శించే కోపం, కామం, మనల్ని కొత్తగా భయపెట్టే అంశాలు ( మచ్చ, బియాండ్ కాఫీ కథలు ). కొంతమంది తమలో జరిగే, జరుగుతున్న ప్రభావానికీ , వొంటరితనానికీ , కుటుంబ పరంగా కోల్పోతున్న వాటికీ .. అందులోనే పరిష్కారం వెతుక్కొనేవాళ్ళు .. (ఘటన కథ) లేదా ..ఏ అవుటర్ రింగ్ రోడ్ ఘోరానికో బలైపోయి ఆగే వాళ్ళు, సాగే వాళ్ళు ( అపస్మారకం, ఇంకోవైపు కథలు )
హ్మ్మ్.. ఇవి ఇబ్బందికర నిజాలు.. కానీ .. నిజాలు .. రాసినందుకు శభాష్ అనాలో ….సుమారు దేశం అంతటా జరుగుతున్న విసర్జకం సాహిత్యంలోకి, కొత్త వ్యర్ధాల దారుల్లోకి …. అందంగా పవర్ఫుల్ గా వచ్చినందుకు విచారించాలో … డార్క్ శకానికి స్వాగతం పలకాలో … తెలీని .. అయోమయంలో ముగిస్తున్న రివ్యూ ..
చివరగా ఖదీర్ గారి లాంటి గొప్ప రచయితల గురించి నేను మాట్లాడేది ఏమీ ఉండదు .. గానీ.. ఒక రీడర్ గా .. ఒక కుతూహలపు ప్రశ్న .. వొంటరితనం , వెతుక్కోవటం, వాటి పీడ,బాధ .. ఆడవాళ్లకేనా .. మగవాళ్ళకి ఉండవా ..? ఈ మోడరన్ కాలంలో .. ప్రతీ వ్యక్తీ వస్తు ప్రపంచం వల్లా, అధికార సమీకరణాల వల్లా .. వచ్చి,తెచ్చి పెట్టుకున్న ఖాళీతనాల వల్ల .. జరిగే అత్యాచార బాధితులే .. అలాంటి వాళ్లకి .. ఏ వాదం లేని పరిష్కార మార్గాలు కూడా కావాలి .. లేకపోతే వాళ్ళు మళ్ళీ రచయితలకీ, తీరుబాటు ఉన్న లేదా లేని మరో వ్యక్తిని సోషల్ గా హింసించటం జరుగుతుంది .. ఆ మార్గాలు సూచనప్రాయంగా నైనా చెప్తే బాగుండేది ..!!
Finally… Life is NOT Just Beyond Coffee… It Sometimes Above Many Dark Skeletons Carefully Paraded as Fashion Icons..!!
దృష్టిలోపంతో దారితప్పిన కథలు - జి ఎస్ రామ్మోహన్
ఖదీర్ వాక్యం డ్రైవింగ్ తెలిసినవాడు పద్దతిగా వాహనం నడుపుతున్నట్టు ఉంటుంది అంటాడు పూడూరి రాజిరెడ్డి. గేర్ ఎక్కడ మార్చాలో ఖదీర్‌కు బాగా తెలుసు. ఇపుడు బియాండ్ కాఫీతో అతను చేసిందదే. ఇంతకుముందే కింద నేల ఉందితో అతను హైజంప్ చేశాడు. ఇపుడు ఏకంగా పోల్‌వాల్ట్. అందులో ఎంత సఫలీకృతుడయ్యాడనేది తర్వాత చూద్దాం. పాతను వదిలేసుకుని కొత్త ముఖమైతే తొడుక్కున్నాడు. బహుశా దర్గామిట్ట నాటి పాత అభిమానులకు కూడా వదిలేసుకునేందుకు సిద్ధపడ్డాడని అర్థమవుతోంది. రచయితతో పాటు ప్రయాణం చేసే వారి కథ వేరే.
దర్గామిట్ట కథలను చాలామంది ప్రేమించారు. బహుశా నామినిని మించి ప్రేమించారేమో కూడా. ఆ కథల్లోనూ ఆ ప్రేమలోనూ చిన్న ఇబ్బంది ఉంది.నామినిలో ఉన్న సొగసు చాలావరకు ఖదీర్ కథల్లో ఉంటుంది కానీ ఈ పెయిన్ తక్కువ. పేదరికాన్ని సెలబ్రేట్ చేసినట్టుంటాయి దర్గామిట్ట కథలు. తమకు తెలీని జీవితాన్ని కులీనులు నోరెళ్లబెట్టి చూసి అరె, భలే రాశాడే అనిపించేట్టు ఉంటాయి. హైదరాబాద్‌లో శిల్పారామం పోయి అక్కడ గుడిసెలు, రోకళ్లు, రోళ్లు, ఎద్దుల బండ్లు చూసి ముచ్చడపడతారే, అలా!
తొలి మూడు కథలు కథలే. అందులోనూ టాక్ టైమ్ మంచి కథ. ఆ తర్వాత అవి ఎటోటో వెళ్లిపోయాయి. 'మచ్చ' మంచిదే కానీ చివర్లో రచయిత అలవోకగా విసిరేసిన ఒక వాక్యం కథను దెబ్బతీసింది.
పుస్తకానికి టైటిల్ బియాండ్ కాఫీ కథ తీసుకుందాం. "ప్రతి మగనాబట్ట ఛాతీ మీద పచ్చబొట్టు పొడవాల్సిన'' నీతి కథ చెప్పిన మరికాసేపటికే ఆ పొందికలోకి ఇమడని డీటైల్స్ ఎక్కువైపోయి, చివర్లో క్రైం థ్రిల్లర్ అయిపోయి కథ ఎటో పోయింది. తాను కొత్తగా తెలుసుకున్న విషయాలు ఎక్కువగా చెప్పాలన్న ఆత్రం ఈ కథను దెబ్బతీసిందేమో అనిపిస్తుంది.
సున్నితమైన అంశాలను కథలుగా మలిచేపుడు ఎక్కువ జాగ్రత్త అవసరం. ఒడుపు తెలుసుకదా అని తొందరపడితే నోరు కాలుతుంది, చేయి కాలుతుంది. మొదటి కథల్లో మనకు బాధితులెవరో తెలుస్తుంది. వారిపట్ల ఎంతో కొంత ఆర్తి కలుగుతుంది. తాగుబోతు భర్త పట్టించుకోక ఏ ముచ్చటా తీరక విసుగ్గా ఉన్న మహిళ యాక్సిడెంటల్‌గా కలిసిన, తనపై ఆసక్తి కనపరిచిన కుర్రాడితో సెక్స్ తర్వాత స్థిమితపడే స్థితిని అర్థం చేసుకోగలము. ఆ మహిళ ఎర్రేటిక్ బిహేవియర్‌ని కూడా అర్థం చేసుకోగలం. చివరకు రచయితలకు ఫోన్లు చేసి భయంకరంగా వేధించే స్ర్తీ పైన కూడా కోపం రాదు. ఆ తర్వాతి కథల్లోనే బ్యాలెన్స్ కుదరలేదు. అందులో చర్చించినవి కూడా అవాస్తవాలేం కాదు. కొంతమంది స్ర్తీలకు సంబంధించినవే అయినా అవి వాస్తవాలే. 'మైనారిటీ' కథలు రాయకూడదని రూలేం లేదు. భర్త వేళ్లు కోసేసిన భార్య సంగతి పక్కనబెడితే చాలావరకు ఇందులో ఉన్న పాత్రలన్నీ నిజమైనవే. మనకు కనిపించేవే. కాకపోతే ఊరకే సంచలన వాస్తవాలను వెల్లడించడం దానికదే కథ కాదు కదా! ఆ వాస్తవాలకు సాహిత్య రూపమిచ్చేదేదో ఉంటుంది కదా! అది ఆ కథల్లో లోపించింది. కొన్ని కథల్లో వక్రీకరించింది కూడా. ఇంకో విషయం కూడా చెప్పక తప్పదు. కొద్దిమందికే పరిమితమైన కథలు రాయడం వరకూ ఇబ్బంది లేకపోయినా సమాజంలో ఒక సమూహం గురించి ఇంకో సమూహంలో ప్రచారంలో ఉండే స్టీరియోటైప్స్‌ని యథాతథంగా సమర్థిస్తున్నామేమో అనేది కూడా రచయిత ఆలోచించుకోవాలి.
జి ఎస్ రామ్మోహన్
(సారంగ వెబ్ మ్యాగజైన్(sarangabooks.com/magazine)లో 22.8.2013న ప్రచురితం)