కొన్ని కథలూ చదివితే కళ్ళు తడి అవుతాయి...ఇది పైకి అందరు ఒప్పుకోకపోయినా అది వారి అనుభవానికి వచ్చే ఉంటుంది .... మనసు పొరల్లోకి చొచ్చుకొని పోయి మనసు ఆర్ద్రత కంటి నీరుగా మారుతుందన్నది అక్షరాల సత్యం. అలాంటి కథ చెప్పే ముందు నా మాటలు మీ మనసుతో వినండి...
ప్రతీ ఒక్కరికి తనదైన శైలి ఒకటి ఉంటుంది..కొందరు అవతలి వాళ్ళు చెప్పింది ఎంతసేపు ఐన వినగలరు..అవతలివాళ్ళకి కావలసిన సమాధానం మాత్రమే చెప్పగలరు...ఇంకొందరు బాగా మాట్లాడగలరు వాళ్ళ సమక్షంలో అవతలి వాళ్ళు తమ సమస్యలే కాదు తమను తాము మరచిపోగలరు..ఇంకొందరు అవతలివాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని అయినా నవ్వించగలరు...మరికొందరు కవితలు, పాటలు అనే వాళ్ళకున్న కళలతో ఆకట్టుకోగలరు......ఎంటువంటి ప్రత్యేకత లేకుండా ఏ ఒక్కరూ ఉండరు....ఇది ఎవరైనా ఒప్పుకోవలసిన నిజం....
ప్రతీ మనిషిలో ఒక ప్రత్యేకత ఉండడం ఎంత సహజమో .....దాన్ని అవతలి వాళ్ళకోసం తక్కువగా మనకోసం ఎక్కువగా వాడుకోవడం కూడా అంతే సహజం.. కొందరు సహజసిద్దంగా ఆ ప్రత్యేకతలను తమకోసమే కాకుండా అవతలివారికోసం ఉపయోగించేవాళ్ళు ఉంటారు..కొందరికి అది భుక్తి మార్గం కోసం చేయొచ్చు...ఇంకొందరు అవతలి కన్నుల్లో కాంతి కోసమే ఉపయోగించేవాళ్ళూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు సహజంగానే మనుషుల్లో తమ మాటలకి అవతలి వారిలో ఆనందం కలుగుతుంది అని అనిపిస్తే చెప్పడం మానేస్తారేమో కానీ, అవే మాటలు అవతలి వారిని క్షోభ పెడతాయని అనిపిస్తే మాత్రం వెతుక్కొని ఆ మనిషి చెంత చేరి మాట్లాడడానికే ప్రయత్నిస్తాం.
మనం చేయగలిగివుండి కూడా చేయకుండా ఆగిపోయే పని మనలోని ప్రత్యేకతను మరొకరి ఆనందం కోసం ఉపయోగించకపోవడం..ఇందులో మనం కోల్పోయేదేమి లేదు మన శ్రమనో లేదో డబ్బునో పెట్టుబడి పెట్టడం లేదు కనీసం సమయం ప్రత్యేకంగా పెట్టడం లేదు...మనం చేసే రోజువారి ప్రక్రియలోనే మనకు ఎదురుపడిన వారికి అందించే సమయంలోనే మీలోని ప్రత్యేకతను కలపడమే కదా...
సహజసిద్దంగా ఒకరికి ఆనందం పంచాలని మనసుకి ఉంటే ....భుక్తి కోసం చేసే పనిలో కూడా ఇతరులకు ఆనందం పంచె ఈ పొట్టిబాబు ఎంతో ఉన్నతుడుగా కనిపిస్తాడు మీ మనసులకి.....
పొట్టిబాబు....
ఆడుగడుగో అతగాడే పొట్టిబాబు....పేరుకి తక్కట్టుగా పొట్టిబాబు పొట్టిగానే కాదు యాభై ఏళ్ళు పైబడినా బాబులాగానే ఉంటాడు. నిక్కరూ చొక్కా మీద ఉంటాడు. మెళ్ళో బోర్డొకటి వేల్లాడుతూ ఉంటుంది. దాని మీద యిలా రాసి ఉంటుంది.
రూపాయికో జోకు.
మీకు నవ్వు రావడం ఖాయం.
లేదంటే మీ రూపాయి మీకు వాపసు.
విశాఖ బీచ్ లో ఉదయం ఆరు నించి ఎనిమిది వరకూ, సాయంత్రం నాలుగు నించి రాత్రి ఎనిమిది వరకూ పొట్టిబాబు కనిపిస్తాడు. పిలిస్తే వస్తాడు రూపాయిచ్చి అడిగితే జోకు చెపుతాడు. జోకు పాతదే కావచ్చు కానీ అతగాడు చెప్పే పద్దతికి నవ్వొచ్చి తీరుతుంది. ఆ పద్దతి ఆతను నిన్నో మొన్నో నేర్చుకోలేదు. ముప్పయ్యేళ్ళ కిందట బుర్రకథలు చెప్పేటప్పుడు నేర్చుకున్నాడు. దంపుడు లక్ష్మి బుర్రకథ దళంలో అతడు వంతలు పాడేవాడు. హాస్యగాడు పొట్టిబాబు హాస్యం ఆంటే కళింగాంధ్రలో పెద్ద పేరు . సినిమాలు, టివీ రావడంతో చాలా జానపద కళలు తుపాకీ దెబ్బకి చెట్టు మీది పిట్ట లెగిరిపోయినట్టు గా ఎగిరిపోయాయి.అందులో బుర్రకథ కూడా బుర్రుపిట్టలా ఎగిరిపోయింది. పొట్టిబాబు మాత్రం పిట్టలదొరలా విశాఖ నంటి పెట్టుకుని ఉండిపోయాడు. భార్య ఈ మధ్యనే పోయింది. పాపం! ఓ కొడుకున్నాడు. వాడికి పెళ్లయింది. కోడలి చేతిలో రోజుకి ఇరవై రూపాయలు పెడితేనే రెండు పూటలా తిండీ. పెట్టలేదనుకో! పొట్టిబాబుకి మంచినీరు ఆహారం. కడుపు నిండా నీరు తాగి పడుకోవాల్సిందే! అందులో మొహమాటం లేదు. అందుకని రోజుకి ఎలాగయినా ఇరవై రూపాయలు సంపాదించి తీరాలి.
సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకుందామని బీచ్ కి వచ్చిన వాళ్ళని ఇట్టే గుర్తిస్తాడు పొట్టిబాబు. గుర్తించి రూపాయి ఇవ్వక పోయినా, వద్దన్నా జోకులు చెపుతాడు.
చావడానికి మూడు సులువైన మార్గాలున్నాయి. ఒకటి రోజుకో చుట్ట తాగండి! పదేళ్ళ ముందుగానే చనిపోతారు. రెండు రోజూ విస్కీ తాగండి! ముప్పయి ఏళ్ళ ముందుగా చనిపోతారు. మూడు: ఎవర్నయినా నిజాయితీగా ప్రేమించి చూడండి. రోజూ ఛస్తూ బతకొచ్చంటాడు. ఇప్పుడూ అదే పరిస్థితిలో ఉంటే చావడం ఎందుకంటాడు.నవ్విస్తాడు. అప్పుడా సమయంలో రూపాయిస్తే తీసుకోడు. రేపివ్వండి,తీసుకుంటానంటాడు. రేపులోని తీపిని చూపించి వెళ్ళిపోతాడు. అలా చాలా మందిని బతికించాడు పొట్టిబాబు.
భార్యతో గొడవ పడుతున్న భర్తని చూశాడంటే చాలు! రహస్యం చెబుతున్నట్టుగా యిలా చెబుతాడు.
'నోర్ముయ్' అని భార్య మీద ఒంటి కాలి మీద లేస్తే ఆవిడా నోరు ముయ్యదయ్యా!నీ పెదవులు రెండూ దగ్గరగా ఉంటే, చిన్ని నోరూ నువ్వూ భలే ముద్దోస్తావు అను చాలు! నోరు మూస్తుంది.గొడవలుండవంటాడు. గర్ల్ ఫ్రెండ్ కోసం వెతికే అబ్బాయిల్ని చూశాడంటే ఆట పట్టించి కానీ వదలడు. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే జీవితంలో ఏదో కొంత కోల్పోయినట్లే! గర్ల్ ఫ్రెండ్ ఉంటే జీవితాన్నే కోల్పోయినట్టని తెలుసుకో అంటాడు.
పొరపాటు చేసినా అభినందనలు చెప్పే రోజొకటి ఉంది. అదేంటో తెలుసా? పెళ్లిరోజంటాడు పొట్టిబాబు. అలాగే రెండు పెళ్ళిళ్ళు చేసుకోకూడదని గవర్నమెంట్ ఎందుకు గోల చేస్తుందంటే ...మన రాజ్యాంగం ప్రకారం ఒకే తప్పుని రెండు సార్లు చేస్తే శిక్షించే అవకాశం లేదంటాడు. చీకటిలో ఉన్నాననుకుంటే వెలుతురు కోసం దేవుణ్ణి ప్రార్ధించు, ఎంత ప్రార్ధించినా దేవుడు నీ మొర వినలేదంటే... కరెంటు బిల్లు కట్టాలని గుర్తు పెట్టుకో అంటాడు.
అయిదు రూపాయిలే ఆర్జిన్చాడిప్పటికి, ఇంకా పదిహేను రూపాయలు సంపాదించాలి. జోకులు వినేవాళ్ళెవరు?వెతుకుతున్నాడు పొట్టిబాబు. అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆడుగడుగో ఆతగాడే పొట్టిబాబు!!ఇడిగిడుగో ఇటోస్తున్నాడు
ఏంటి ఇది నిజమా? కాని అది అతనికి బ్రతుకు తెరువు..అలా అని చెప్తే మనం వింతగా చూస్తాం..నిజంగా ఒక్క రూపాయీ ఎ పాటి చెయ్యదు..కాని అతని గతం, ప్రస్తుతం మాత్రం మనకి తెలియదు..రుపాయీ ఇవ్వడానికి ఓ వంద మాటలన్న అంటాము..ఆశ్చర్యం గా మనమే బ్రాండెడ్ వస్తువుల కోసం మొహమాటం లేకుండా ఎంతో ఖర్చు పెడతాం.. మీటరు మీద వచ్చిన ఆటో వాడికి నచ్చి పది రూపాయలు ఎక్కువ ఇస్తే వాడి మొహం లో కలిగే ఆనందం, మన బరువు లు మోసిన కూలికి చెప్పిన దానికంటే ఐదో పదో ఎక్కువ ఇస్తే పడే సంతోషం..మనం కొన్న బ్రాండెడ్ బట్టలు వేసుకున్నపుడు కూడా మనకి రాదు..ఇది అప్రస్తుతం ఏమో తెలీదు..కాని ఒకటి నిజం...ఐదు పది అవసరం లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కక్కుర్తి పడే మనం..అప్పనంగా డబ్బులు ఎవడికో సమర్పించుకుంటాం...
--
Thank you,
LakshmiNaresh