అమలాపురం దగ్గర ఒక చిన్న ఊరు పుల్లేటికుర్రు.. నేను ఎపుడో 20 సంవత్సరాల క్రితం ఓ సారి వెళ్ళాను, అక్కడ నా స్నేహితురాలికోసం వెళితే తను లేనందున, అపుడు అక్కడ ఒక 15 నిముషాలు మాత్రమే ఉన్నాను.. తరవాత ఇన్ని రోజులకి వెళ్ళాను ఆ ఊరు.. అక్కడ చూసాను బుల్లి పాపని..ఈమె నాకు ఇంతకు ముందు కూడా తెలుసు తను హైదరాబాద్ వచ్చి ఒక నెల రోజులు ఉండింది తను నాకు బంధువు కాదు కానీ నా స్నేహితురాలికి బంధువులు.
బుల్లి పాప సన్నగా ఉండినా..తన మాట మాత్రం తన రాక కంటే ముందే మనలను చేరుతుంది..బుల్లి పాపకి రెండు బాడి గార్డ్స్ ఉంటాయి వాటి పేర్లు చిన్న రాయుడు, బుల్లి రాయుడు..పెద్ద వేటకుక్కలేమి కాదు కానీ బుల్లి పాప వాటి గురించి చెపుతుంటే వాళ్ళు ఎవరో పిల్లలని అనుకుంటారు తెలియని వాళ్ళు..బుల్లిపాపను చూడగానే మేనరికం వలన వచ్చిన చిన్న అవకారం మనకు కనిపించక మానదు కానీ తనతో 12 గంటలు ఉంటే చాలు మన కంటి నుంచే కాదు మనసు నుండి కూడా తనలో అవకారం ఉందన్న స్పృహ ఉండదు.. అది ఎలా సాధ్యం అంటే మరి అదే బుల్లి పాప గొప్పదనం.
బుల్లి పాప ఏమి చేస్తుంది అని అడిగితే నాకు జవాబు చెప్పడం ఒకింత కష్టమైన విషయమే..ఆమె ఏమి యండమూరి కథలోని బుల్లి పాప కాదు..తన తెలివితేటలూ కథలా చెప్పడానికి.. బుల్లిపాపని చూసాకా ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉంటె బాగుండు అని అనుకొని వారు ఉండరు.. కానీ బుల్లి పాపలా ఉందామని ఆశ మాత్రం పడరు. ఎందుకంటే ఎవరైనా కష్టం కావాలని కోరుకోరు కదా.. బుల్లి పాప ఎంత పని ఐనా అలవోకగా చేస్తూనే ఉంటుంది. తనని చూస్తూ ఉంటె "బుల్లి పాప పని చేయడానికి ఆరాటపడుతుంది అనిపించదు..పనే బుల్లి పాప వెంట పడుతుందేమో నా సంగతి చూడు అని" అనిపిస్తుంది.
బుల్లి పాప ఎంత మంది కైనా వాళ్ళు కూర్చున్న దగ్గరకు అన్నీ చేసిపెడుతుంది. ఎలాంటి మనిషి ఐనా ఒక్కరోజులో అలా చేయించుకోవడంలో ఉన్న సుఖానికి దాసులు కాక మానరు. ఆ సుఖానికి అలవాటు పడిన తరువాత ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఎంత బాగుండు అని ఆశ పడక మానరు..తనను చూస్తూ బుల్లి పాప ఇంత పని ఇలా చేస్తుంది..మేము ఇలా చేయగలిగితే బాగుండు అని మనసులో ఆశ పడక మానరు. కానీ బుల్లి పాపలా ఉందామని మాత్రం ఆరాటపడరు ఆశ మాత్రామే పడతారు.
బుల్లిపాపలా ఉండాలంటే అందుకు చేయాల్సింది కష్టపడటం.. అది కూడా ధన సంపాదనకోసం కాదు..అలా అందరికి కావలసినవి అమర్చిపెట్టడం అందుకు పని చేయడం ఒక్కటి మాత్రామే వస్తే సరిపోదు అవతలివారు ఎవరు అనే దానికన్నా వారికి కావలసినవి చేయాలి అనే విషయం మనసుని ఎపుడూ అంటిపెట్టుకొని ఉండాలి అపుడు మాత్రామే అందరికి అన్నీ చేసిపెట్టగలం. అలా ఉండడం చెప్పినంత సులువైన పని కాదు. మనం మన అనుకున్నవాళ్ళకే చేయడానికి ఒకోసారి మనసు రాదు.
బుల్లి పాపని చూసి కొందరు అబ్బో తనకి మనుషులని ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు.. తనపై ఆధారపడేట్టు చేసుకుంటుంది. మనలను ఏ పని చేయనీయదు. మనం చేద్దామని వెళ్ళినా ఎందుకు నేను చేస్తాను కదా అంటూ ఉంటది అని అంటారు. కానీ.. నిజంగానే బుల్లిపాప దగ్గర ఏదో చేస్తాం అని మాటవరసకు అనగలమే కానీ ఆ పని అందుకొని తనకంటే బాగా చేద్దాం అని ఏమి అనిపించదు.. తను పనితో ఆడుకుంటున్నట్లు ఉంటు౦దే కానీ అలసిపోయి పని చేస్తున్నట్టు ఉండనే ఉండదు.. బుల్లి పాప ఎంత పని చేస్తుందో అని మెల్లిగా అనగానే ఆ ప్రక్క నుండి ఇందులో పెద్ద పనేముందండి అని జవాబు తప్పక వచేస్తుంది..
నాకు మాత్రం బుల్లిపాప ఒక అద్బుతం.. తనలా ఉండలేనేమో కానీ.. ఉంటె బాగుందనే ఆశ మాత్రం ఉంది ...నేను బుల్లి పాపని కాక పోయినా...నన్ను చూస్తే బుల్లి పాప గుర్తుకు వచ్చెంత అయిన ఉంటె చాలని ఆశ...