పురాతన ఆలయాలకు ప్రసిద్ధి గాంచిన కర్నూలు జిల్లాలో (ahobilam) అంతులేని సంపద భూగర్భంలో దాచి ఉంచారని చరిత్ర చెబుతోంది. అహోబిలం ( ఆంధ్ర అనంత పద్మనాభ స్వామీ), శ్రీశైలం, మహానంది, యాగంటి లాంటి ఎన్నో ముఖ్యమైన పురాతన క్షేత్రాలతోపాటు ఆసియాలోనే పొడవైన బెలూం లాంటి భూగర్భ గుహలూ ఇక్కడ అనేకం ఉన్నాయి. కీకారణ్యంగా పేరొందిన నల్లమల అటవీ ప్రాంతంలోని రెండు ఆలయాల్లో భూగర్భంలో నిక్షిప్తమైన సంపదకు విలువ కట్టడం సాధ్యం కాదనే అంటు న్నారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అహోబిల నరసింహ క్షేత్రం ఇందులో ఒకటి కాగా, ఆత్మకూరు సమీపంలోని శ్రీవీరభద్రస్వామి ఆలయం మరొకటి.
ఈ రెండు చోట్ల రెండున్నర దశాబ్దాల క్రితం భూగర్భంలోని నిధులను బయటకు తీసే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అను కోకుండా ఎదురైన అవాంతరాల ప్రభావమో లేక భగవంతుని ఆగ్రహమో తెలియదు కానీ ఒకచోట తవ్వకాలకు పాల్పడిన వ్యక్తి జైలు పాలైతే, మరోచోట ప్రయత్నించిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. హైకోర్టును ఆశ్రయించి అహోబిలంలో తవ్వకాలకు 1986లోనే అనుమతులు సంపాదించిన నాగరాజు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, వీర భద్రాలయం వద్ద నిధులను బయటకు తీసేందుకు ప్రయత్నించిన నారాయణాచార్యులు అనేక ఇబ్బందులు పడ్డారని చెబుతున్నారు. వీరి అంచనాలతోపాటు చరిత్రకారుల లెక్కల ఆధారంగా అహోబిలంలో టన్నుల కొద్దీ బంగారం ఉందంటున్నారు. దీని విలువ 5 లక్షల కోట్ల రూపాయలపై మాటేనని కూడా చెబుతున్నారు. ఇక్కడ ‘అనంత’ సంపదను మించే ఉంటుందని అంటున్నారు. ఇక వీరభద్రస్వామి కొలువై ఉన్న నాగలూటి ఆలయంలో మన రాష్ట్ర బడ్జెట్‌కు రెండింతలుగా నిధి నిక్షేపాలున్నాయంటున్నారు. ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయని వాదించే వారుండడం విశేషం.
హిరణ్యకశపున్ని సంహరించిన నరసింహస్వామి బలాన్ని చూసి దేవతలు ‘ఆహాబల’ అన్న ప్రదేశం ఇప్పుడు అహోబిలంగా మారింది. కృత యుగంలో స్వామి ఇక్కడ అవతారం ఎత్తాడని చెబుతారు. నరసింహ స్వామిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దర్శించుకున్నారని చరిత్ర చెబుతోంది. కలియుగంలో వెంకటేశ్వరస్వామి కూడా స్వామివారిని దర్శించుకున్నట్లు చారిత్రక సాక్ష్యా లున్నాయి. ప్రతాపరుద్రుడు, 2వ ప్రతాపరుద్రుడు, ఆదిశంకరులు, మద్వాచార్యులు, రామానుజాచార్యులతో పాటు శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసింహస్వామి ఆలయాన్ని తరచు దర్శించుకునేవారని చరిత్ర చెబుతోంది. 6వ శతాబ్దంలో అహోబిల ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తోండగా, 1398వ సంవత్సరం నవంబర్ నెలలో అహోబిల పీఠం ఏర్పాటైంది.
ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా పీఠం ఏర్పాటులో తమిళులు కీలకపాత్ర పోషించడంతో అది ఇప్పటికీ వారి అధీనంలోనే ఉంది. ఈ పీఠానికి 6వ పీఠాధిపతిగా పని చేసిన షష్ట పరాంకుశ మహాదేశికన్ 1513 సంవత్సరం ఫిబ్రవరిలో ఆలయ ప్రాంగంలోనే జీవసమాధి అయ్యారు. ఆ సమయంలో ఆల యానికి చెందిన సంపద నంతా తనతో పాటే ఆయన తన సమాధిలోకి తీసుకెళ్లారని చరిత్ర చెబు తోంది. పరాంకుశ మహాదేశికన్ ఎగువ అహోబిలంలోని నరసింహ స్వామి ఆలయ గర్భగుడికి ముందున్న ప్రాంతంలోనే సమాధి చెందారు. ఇప్పటికీ అక్కడ ఇందుకు సంబంధించిన ఆనవాళ్లున్నాయి. సమాధిపై ఎలాంటి కట్టడాలు లేకపోయినా ఆ ప్రదేశంపై అడుగు పడకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లున్నాయి. ఇక్కడే అంతులేని సంపద పరాంకుశ మహాదేశికన్ సమాధిలో ఉందని భావిస్తున్నారు.
దీన్ని తవ్వేందుకు 1986లో కోలార్‌కు చెందిన నాగరాజు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేలమాళిగను తెరిచేందుకు ఆయన హైకోర్టు అనుమతి కూడా తెచ్చుకున్నారు. అపార సంపదను బయటకు తీసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని కోలార్ వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో కర్నూలు జిల్లా ఎస్పీగా ఇప్పటి డిజిపి దినేష్‌రెడ్డి ఉండడం విశేషం. నాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం నరసింహ స్వామి ఆగ్రహ ఫలితమేనని భావించిన మిగిలిన వారు తవ్వకాలను మొదలుపెట్టకుండానే వెను తిరిగారు. అయితే, జీవసమాధి అయిన షష్ట పరాంకుశ మహాదేశికన్ అక్కడ ఇప్పటికీ జీవించే ఉన్నారని భావిస్తున్న భక్తులు ఆయన ఆత్మ భగ వంతునిలో లీనమైన మరు నిముషంలో నేల మాళిగ తెరుచుకుంటుందని విశ్వసిస్తున్నారు.
అనంతపద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలను తెరిచే అంశంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు అహోబిలం స్వామి వారి సంపదపై కూడా ఆదేశాలిచ్చే అవకాశం ఉందంటున్న నేపధ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు అహోబిలం నేల మాళిగను తెరవాలని ఆదేశిస్తే అది జరుగు తుందా? జరిగితే ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడుతుందనేది అం దరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. ఇక నల్లమల అటవీ ప్రాంతంలో ఆత్మకూరుకు సమీపంలోని నాగ లూటిలో ఉన్న వీరభద్రస్వామి ఆల యంలోనూ అపార సంపద ఉందని అంటున్నారు.