కోనేరులో నిధులున్నాయా ...?..పద్మనాభుని దేవాలయం అనంత సంపదలకి ఆలవాలం

ఒక బస్తా నిండా ఇంకా వెలకట్ట(లే)ని వజ్రాలు. మరో చోట పదిన్నర కిలోల బరువున్న 18 అడుగుల పొడవైన బంగారు హారం. ఇంకోవైపు 500 కిలోల బరువున్న బంగారు రేకుల దొంతర. అటు చూస్తే 36 కిలోల బరువున్న బంగారు పరదా. ఇంకా బంగారు, వెండి పాత్రలు లెక్కలేనన్ని. వాటితోపాటు అపురూపమైన పురాతన నాణేలు, వజ్రఖచిత కిరీటాలు! ఇవన్నీ కేరళ రాజధాని తిరువనంతపురంలో కొలువై ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ ప్రాంగణంలో బయటపడుతున్న నిధినిక్షేపాల్లో కొన్ని! కళ్లు చెదిరే ఈ సంపదంతా శతాబ్దాలుగా ఆలయం కింది భాగంలో ఉన్న గదుల్లో నిక్షిప్తమై ఉంది. ఈ అపురూప సంపద నిజానికి వెలకట్టలేనిది. ఎందుకంటే, ప్రాచీనత ఉన్న ఏ చిన్న వస్తువైనా వేలంలో కోట్లాది రూపాయలు పలుకుతున్న సంగతి తెలిసిందే.

అలాంటప్పుడు ఈ సంపద విలువను లెక్కేయడం మామూలు విషయం కాదు. ఎంతో నిపుణులైతే తప్ప అది సాధ్యం కూడా కాదు. బంగారు ఆభరణాల విలువ ఇప్పుడున్న ధరల్లో చూస్తే లక్ష కోట్లకు పైగా ఉంటుందని వార్తలు వస్తున్నా, సుప్రీంకోర్టు నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీ మాత్రం దాన్ని నిర్ధారించడానికి నిరాకరిస్తోంది. ఆ గదుల్లో ఉన్న వస్తువుల జాబితా తయారుచేయడమే తమకు సుప్రీంకోర్టు అప్పగించిన బాధ్యతని కమిటీ చెబుతోంది.

ఇదంతా భక్తులు సమర్పించిందేనా!

కోరిన కోర్కెలు నెరవేరినప్పుడో, ఆపదల నుంచి గట్టెక్కినప్పుడో భక్తులు తమ ఇష్టదైవానికి కానుకలు చెల్లించుకోవడం రివాజే. కానీ, అనంత పద్మనాభస్వామి ఆలయం తీరే వేరు. అది కేవలం సర్వాంతర్యామి కొలువుదీరిన కోవెల మాత్రమే కాదు. ట్రావెన్‌కోర్ సంస్థానాన్ని ‘పరిపాలిస్తున్న’ సర్వశక్తిమంతుడి రాజప్రాసాదం కూడా. అందుకే, భిన్న మార్గాల ద్వారా సంస్థానానికొచ్చే ఆదాయమంతటినీ ఆలయంలోని కింది భాగంలో నిర్మించిన గదుల్లో భద్రపరిచేవారని అంటారు.

ఈ సంస్థానానికి అసలు పరిపాలకుడు ఆ అనంతపద్మనాభస్వామేనని, తాము ఆ స్వామి దాసులుగా మాత్రమే సింహాసనంపై కూర్చున్నామని అక్కడి ఏలికలు ప్రకటించారు. ఆ కాలంలో బర్మా, శ్రీలంకలాంటి ఇరుగుపొరుగు దేశాలతోనే కాదు, ఎక్కడో ఉన్న ఇటలీతో సైతం ట్రావెన్‌కోర్ సంస్థానానికి వ్యాపార సంబంధాలుండేవి. లభ్యమైన నిక్షేపాల్లో టన్ను బరువున్న బంగారు బియ్యపు గింజలు, పెద్ద బస్తా నిండా ఉన్న వజ్రాలు బర్మా, శ్రీలంకల నుంచి తెప్పించినవేనని చెబుతున్నారు. ఇలా వ్యాపారాల్లోనూ, పరిపాలనాపరంగా విధించే పన్నుల ద్వారానూ ఖజానాకు సమకూరే సమస్త ఆదాయాన్నీ ఇక్కడే నిక్షిప్తం చేసి అవసరం వచ్చినప్పుడు దాని నుంచి ఖర్చుచేసేవారని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిత్య వ్యవహారాలకయ్యే వ్యయానికి కావలసిన సంపదను మాత్రం వేరే ఖజానాలో ఉంచేవారని వారి అంచనా. ఎప్పుడో ట్రావెన్‌కోర్ సంస్థానం కరువుకాటకాలతో అల్లాడిపోయినప్పుడు.. అంటే 130 ఏళ్లక్రితం శ్రీ విక్రం తిరునాళ్ పరిపాలకుడిగా ఉన్నప్పుడు ఆలయంలోని శ్రీవారి ఖజానా నుంచి తీసి ఖర్చుచేశారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆలయ సంపద కాదని, పొరుగు రాజ్యాలనుంచి దాడుల బెడద ఉండటంతో ఆ సంపదంతటినీ కాపాడుకోవడానికి ఇలా రహస్యంగా దాన్ని నిక్షిప్తం చేసి ఉంటారని మరికొందరి వాదన. గదుల్లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన నాణేలు, యూరప్ దేశాలకు చెందిన నాణేలు, పలు ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ అప్పటి రాజకుటుంబాలకు కానుకలుగా వచ్చినవేనని భావిస్తున్నారు.

ఎన్ని గదులు?: ఆలయంలో మొత్తం ఆరు గదులున్నాయి. వీటికి ఏ,బీ,సీ,డీ, ఈ, ఎఫ్ అని పేర్లుపెట్టారు. గత గురువారం ‘ఏ’ గదిలోని సంపదలో 30 శాతాన్ని మాత్రమే లెక్కించగలిగారు. ఆ గది ఒక్కటీ పూర్తవడానికి శనివారం వరకూ పట్టింది. మొదటి అయిదింటిలోనూ లెక్కింపు పూర్తికాగా, ఆరో గదిని శుక్రవారం తెరవనున్నారు.

పర్యవేక్షణ ఎవరిది?: 1949లో ట్రావెన్‌కోర్ సంస్థానం భారత్‌లో విలీనం అయింది. అయితే, ఈ ఆలయ పాలనావ్యవహారాలను మాత్రం రాజకుటుంబానికే వదిలారు. ప్రస్తుతం రాజకుటుంబీకుల ఆధ్వర్యంలోని ట్రస్టు చూస్తోంది. రాజవంశీకుడైన ఉత్రదాం తిరునాళ్ మార్తాండవర్మ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

ఎందుకీ లెక్కలు!: ట్రస్టు ఆధ్వర్యంలో నడిస్తే ఆలయానికి భద్రత ఉండదని, దీన్ని ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ ఒక టీపీ సుందరరాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆలయ వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. దాంతో ఆలయ సంపద వివరాలు పొందుపరచడానికి ఇద్దరు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సహా ఏడుగురున్న కమిటీని ఏర్పాటుచేశారు.

ఇదీ మా ఘనత: ఇంత సంపద ఉన్నా ఏనాడూ తాము దాని జోలికి పోలేదని రాజకుటుంబానికి చెందిన ఒకరు గర్వంగా చెప్పారు. దేశంలో ఏ రాజవంశమూ తమకొచ్చిన సంపదను వదల్లేదని, తాము మాత్రం తరతరాలుగా తమ పూర్వీకులు నెలకొల్పిన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఏనాడూ ఆ గదుల తలుపులు కూడా తెరవలేదని ఆయన చెప్పారు.

చరిత్రలోకి వెళ్తే...

ఇప్పటి కేరళ, తమిళనాడు ప్రాంతాలను మధ్య యుగాల్లో పరిపాలించిన తమిళ అయి రాజవంశం కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే, 8వ శతాబ్దానికి చెందిన దివ్య ప్రబంధ సాహిత్యంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. తమిళ నమ్మళ్వార్ ఈ ఆలయంపై నాలుగు శ్లోకాలు, ఒక ఫలశ్రుతి రచించారు. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం, వాయు పురాణాల్లో కూడా ఈ ఆలయం ప్రస్తావనకొచ్చింది.

అయి రాజవంశం అంతరించి వేనాడ్ రాజవంశం పగ్గాలు చేపట్టాక తొలి రాజు మార్తాండ వర్మ(1729-1758) తన సంపదనంతటినీ పద్మనాభుడికి సమర్పించుకున్నాడు. సంస్థానం అంతా ఆయనకే చెందుతుందని, తాను కేవలం ఆయన దాసుణ్ణి మాత్రమేనని 1750 జనవరి 3న ప్రకటించాడు. దీన్ని త్రిపాదిదానం అంటారు. ఆయన వారసులు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. గద్దెనెక్కిన ప్రతివారికీ చివర పద్మనాభ దాస అని ఉండేది. రాణులకు పద్మనాభ సేవిని అని చేర్చేవారు.

అక్కడి ధూళి తీసుకొచ్చినా మహాపాపం!

ఇదంతా పద్మనాభుడి సంపద గనుక అందులోంచి పైసా తీసుకున్నా పాపం చుట్టుకుంటుందని సంస్థానాధీశులు భావించేవారు. ఆలయాన్ని సందర్శించి తిరిగొచ్చేటపుడు తమ పాదాలకు అక్కడి ఇసుక రేణువైనా అంటిందేమోనన్న భయంతో కాళ్లు పూర్తిగా తుడుచుకునేవారని చరిత్ర.

పద్మనాభుడి సంపద వెల్లడవుతుంటే మన తిరుపతి వెంకన్న చిన్నబోతాడేమోనని కొందరికి దిగులు పట్టుకుంది. నిజమే...ఈ సంపదనుబట్టి చూస్తే అనంత పద్మనాభుడే అత్యంత ధనికుడు. ఇప్పటి వరకూ తొలిస్థానంలో ఉన్న తిరుపతి శ్రీవారి సంపద రూ. 42,000 కోట్లు అని అంచనా. కనుక ఆయనది రెండో స్థానమే.

సుప్రీం కోర్టు ఆదేశం

కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలో నిధినిక్షేపాల వెలికితీత ప్రక్రియను వీడియో చిత్రీకరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వీటి వివరాలను రహస్యంగా వుంచాలని ధర్మకర్తలు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌, జస్టిస్‌ ఎ.కె. పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. పద్మనాభస్వామి ఆలయ నిధినిక్షేపాల పరిరక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని అత్యున్నత న్యాయస్థానం ప్రతిపాదించింది. దాదాపు 150 ఏళ్ల క్రితం ఆరు నేల మాళిగల్లో విలువైన ఆభరణాలు, బంగారు విగ్రహాలను ట్రావెన్‌కోర్‌ సంస్థానాధిపతులు దాచారు.

పద్మనాభ స్వామి 6 గది ప్రస్తుతం తెరవకూడదని sc నిర్ణయించింది....

ఆరో గదిపై అందరిచూపు:పద్మనాభ ఆలయ రహస్య నేలమాళిగలోని ఐదు గదుల్లోని సంపద లెక్కింపు, జాబితా తయారీ స్వల్ప అవరోధాలు మినహా దాదాపు సాఫీగా కొనసాగింది. కానీ ఆరో గదిని తెరవటంపై తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆ గది ద్వారాలు తెరవటం అత్యంత క్లిష్టమైన ప్రకియతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆ గదిని తెరిస్తే తీవ్ర అరిష్టం కలుగుతుందన్న అపోహలూ స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.

ఇప్పటివరకూ వెలుగుచూసిన సంపద విలువ రూ.లక్ష కోట్లని అనధికారిక అంచనా. ఆరో గదిలో ఇంతకు కొన్ని రెట్లు అధికంగా సంపద ఉండవచ్చని వూహిస్తున్నారు. ఆరో గది తెరవటానికి  తొందరపాటు తగదని సుప్రీంకోర్టు నియమిత పరిశీలకుల బృందం అభిప్రాయపడటంతో గురువారం వరకూ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి ద్వారంపై సర్ప ఆకృతి చెక్కి ఉంది. దీనిని తెరిస్తే వరద వస్తుందని, ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని రకరకాల నమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆరో గది నుంచి సమీపంలోని సముద్రం వరకూ ఓ రహస్య మార్గం ఉందనేది స్థానికుల మరో విశ్వాసం. రాజవంశీకులు కూడా ఈ ద్వారాన్ని కదిలించవద్దనే చెబుతున్నారు.

కోనేరులో నిధులున్నాయా ...?

మైసూర్ రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తరువాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్‌కోర్ రాజులు కొంతభాగం నిధినిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారని వార్తలు తాజాగా గుప్పుమన్నాయి. మరోవైపు, ఆ నిధులపై చెయ్యేస్తే.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, సముద్రం ముంచెత్తి సర్వనాశనం చేస్తుందని పలువురు భయపడ్తున్నారు. ఆలయం, ఆలయం ఎదురున్న కోనేరుల అడుగుభాగంలో రహస్య మార్గాలున్నాయని, నిధులు దాచిన గదుల్లోకి అవి తెరుచుకున్నాయని, ఒకవేళ ఆ గదులను తెరిస్తే.. సముద్ర నీరు ఆ మార్గాల గుండా చొచ్చుకువచ్చి, ముంచేస్తుందని వివిధ ఆసక్తికర కథనాలు ప్రస్తుతం ‘తిరు’ వీధుల్లో షికార్లు చేస్తున్నాయి



ఇదిలా ఉండగా మన రాష్ట్రంలో ఇలాంటి చరిత్ర కలిగిన మరో ఆలయం బయటపడింది. దట్టమైన అడవుల మధ్య ఉన్న అహోబిలంలో నరసింహ దేవాలయంలో కూడా అపూర్వ సంపద ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. పూర్వం కొంతమంది సంపద దొంగలించేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డట్లు సమాచారం.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!