సమయం లేదని చెప్పే
అతను వచ్చాడు
సమయం చూసుకుని...
పనిమాలా వచ్చావు
పని ఏమిటి అన్నాను
కంగుతున్న అతను
నేనెవరో తెలియదా అన్నాడు
నిక్కముగా నిజం చెప్తున్నాను
నీవు తెలిసిన నిన్ను ప్రేమించలేదన్నాను
ఆకతాయి పిల్లాడు ఒకడున్నాడంటూ
నాదైనా పంతంతో పేరు చెప్పాను ...
అది నేనే కదా
సంశయంతో అన్నాడు...
కాదని చెప్పాను కదా
కాస్త అరువు కఠినత్వంతో అన్నాను
కాస్తంత అలకతో
కొంచెం ఓడినమోముతో
మరి కొంచెం తేలని ప్రశ్నలతో
వెనుదిరిగాడు నిశ్శబ్దంగా....
నాకు తెలుసు
మరోసారి తిరిగి వస్తాడని
ఇప్పడో కాసేపటికో ...
బెత్తం పట్టుకొని నాతో యుద్ధానికి
నాతో చిక్కుకుపోవడానికో
తనతో చిక్కని చిక్కులువేయడానికో
అంతా నాదే అని పలికే
ఆకతాయి వాడు...
నిన్ను ఆకాశమంత ప్రేమించొచ్చని
అనడానికి నీ అనుమతి ఎందుకోయ్
అని చెప్పే నా గడుసుతనానికి
ముడిబడ్డ ఆకతాయి పిల్లాడు...