నా నిశ్శబ్దపు పదునులో
నీ మాటల వరవడి అల్లుకొని ఉందని
నా పెదవిపై అలవోకగా
నీ సొగసైన నవ్వు నిలిచిందని
నేనున్న చోట నీడలా నువ్వు ఉన్నావని
ఎవరికి చెప్పినా ఒప్పుకోని ఓ రహస్యం...
నాకై నేను నీ చెంత నిలవనని తెలుసు
నీవు నాకై రావని తెలుసు కదా
అయినా
ఇద్దరి మధ్యన ఇసుమంత
ఖాళీ లేనితనం వింతే మరి...
నీవు మాయతో బంధించావేమో
నేను మంత్రంతో కట్టేశానేమో
ఊహలకు అందని చిక్కుముడి ఏదో ఉంది
తెలుసుకోవాలన్న ఆరాటము లేదు
తెలియాలన్న పంతము లేదు..
ఏదేమైనా ... ఓయ్
నిను గోరింటాకు చేతుల్లో దాచేశాను
ఇష్టమనే తమలపాకుల దడి కట్టేశాను
రాజకుమారా... ఇక
నా నుండి తప్పుకుపోలేని
బందీవి కదోయ్..