ఎవరైనా చూశారా....
దారిన వెళ్లే వాళ్ళని పిలిచి
చూడకుండానే సూపు తిప్పుకుపోతున్నావ్....
నేను పుటుక్కున పోతే
అయ్యో పలకరించింటే బాగుండని అనుకోవా అని కిసుక్కున నవ్వి...
నవ్వుతాలికిలే అని గడుసుగా
అంతా నీ మంచికే చెపుతున్నా అంటది..
కనబడని నారయ్య ఇంటికి
పని కట్టుకొని పోతది...
అమ్మొచ్చిందంట కదరా వోరబెట్టిన
నులకమంచం ఊకనే ఉన్నది...
కంది బేడలు పుచ్చు పడతున్నయ్ బిడ్డ
నువ్వన్న వాడుకుంటే ...
మావోడు వచ్చినట్టు ఉంటది అని ఇచ్చిపోతది ...
ఈ పేదరాశి పెద్దమ్మను చూడనీకి
ముచ్చటగా మనవరాలు వచ్చె
వస్తా వస్తా... సెనగలు తెచ్చే..
కంది బేడలు తెచ్చే......
వద్దు వద్దంటుంటేనే
మూట బియ్యం ఇంట్లోయేసె..
ఎందుకే ఇంతగనం పిల్లా అంటే......
చెప్పనీకేముంది నీకు తెల్వనిదా
"పుచ్చుపట్టినయ్ " అన్న మాట
నీ సొంతమాయే ...
పూర్తి చేయని మాట చెప్పి
ఫక్కున నవ్వింది
ముత్యమంటి మనవరాలు....
అమ్మో... కథల కాణాచీ కదూ
ఎన్ని గుట్లు దాచారో..
మీకు ఎప్పుడైనా ఎదురైతే
ఆగి పలకరించండి....