కొత్త ప్రేమపాఠం

ఎందుకో ఒక్కసారిగా విసుగు వస్తుంది
కాదు... మరేదో కారణం లేని ద్వేషం వస్తుంది...

వార్డురోబ్ ఒక్కసారిగా ఖాళీ చేయాలనిపిస్తుంది
మంచంపై బట్టల మడతలను
చిందరవందర చేస్తూ కుప్పగా పోస్తాను..

చదివిన పుస్తకాలను చదవని పుస్తకాలను
సరి చేయడానికి వీలు లేకుండా
చిందరవందరగా వేస్తాను...

తప్పిపోవాలనుకుంటాను... తప్పుకు పోవాలనుకుంటాను
మళ్లీ నేనెప్పటికీ ఆ చోటికి రాకుండా
ఆచూకీ మరిచే మరుపు కావాలనుకుంటా...
క్షణాల్లో ఎన్ని యుద్దాలో మదినిండుగా

ఓయ్
ఈ వైపున అడుగైనా కదపక
నాపై సారించిన నిశ్శబ్దపు చూపు
కట్టిపడేస్తుంది కదలనివ్వక మెదలనివ్వక

కాస్త తప్పుకోవోయ్
నా దారిన నన్ను వెళ్ళనివ్వు...
విసుగు ద్వేషం నేర్పించే
కొత్త ప్రేమపాఠం నేర్చుకోనివ్వు....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!