మాటలన్నీ పక్షులై ఎగిరిపోయినప్పుడు
మౌనం నా చెంత బందీగా ఉన్నప్పుడు
దేశదిమ్మరినై తిరగాలని
భిక్షపాత్ర నొకటి అరువు తెచ్చుకోవాలని
కానితనం చెంతకు చేరాలని
లేనితనం అల్లుకుపోవాలని
ఆత్మాభిమానం అంటే ఎరుక లేకుండా పోవాలని
తెలియనితనం నీడగా ఉండిపోవాలని
నా మది నిజనిర్ధారణ చేస్తూ
నాకు తెలియని బాట ఒకటి వేస్తోంది
ఓయ్
రాచకార్యాలు కాస్త పక్కన పెట్టి రారాదు
నన్ను ఒక మాట మాట్లాడించిపోరాదు
ఏది ఏమైనా
ఈ వేళ నా మాటతో వంత పాడవోయ్
నా చుట్టూ కాస్త దడి కట్టవోయ్..
(ఈ కవిత భావపురి సాహితీ కదంబం., సెప్టెంబర్.2023 లో ప్రచురితం)