యుద్ధం మొదలయ్యేది
ఇంటి నుండా ...వీధి నుండా
ఊరి పొలిమేర నుండా
జాతి మధ్యనో ...మతం మధ్యనో
దారి తప్పిన యువత మధ్యనో
రక్తం ఏరులై పారితే ఏమనాలి
అది యుద్ధమంటే ఎలా...
దేశాల మధ్య జరిగితే
కళ్ళు చూడలేని గాయాలైతే
మరణాల సంఖ్య పెరిగితే
పరిగణిస్తామేమో యుద్ధమని
అన్నిటికి పెదవి అంచు నుండి
జాలిమాటలు నాలుగు పలికితే చాలేమో
శాంతి శాంతి అంటే సరిపోతుంది కదా..
మనది కాని సామ్రాజ్యం కూలిపోతేయేం
మన ఇంట్లో ..మన వీధిలో
అశాంతితో అల్లర్లకు ఆజ్యం పోద్దాం
కులమంటూ... మతమంటూ
మారణహోమాలు చేస్తూనే ఉందాం
మన వరకు యుద్ధం రాలేదు కదా
శాంతి వచనాలు ఇప్పుడు ఎందుకు మరి...
మన వరకు యుద్ధం వచ్చినప్పుడు
యుద్ధం నీడ తాకని వేరెవరో పలుకుతారులే
శాంతి శాంతి శాంతి అంటూ...
ఓ శాంతిదూత
యుద్ధము ...శాంతి
కవల పిల్లలా ...సవితి పిల్లలా
నీవైన నిజం చెప్పు...
యుద్ధం అంటే ఏమిటో
ఎక్కడ మొదలవుతుందో...