నలుగురు అమ్మాయిలు
మిట్ట మధ్యాహ్నం వేళ
ఇంటి లోపలికి తొంగిచూస్తూ నిశ్శబ్దంగా
దోసెడు మట్టితో చెట్టు కింద చేరారు
కుప్పగా పోసిన మట్టితో గురుగులు చేస్తూ
నాలుగు మాటలు .. నవ్వులు పంచుకున్నారు
వేళ దాటుతుంది....సమయం మించిపోతుంది అంటూ
కుప్పగా పోసిన భాగాన్ని సమాన భాగాలుగా పంచుకున్నారు
తిరిగి వెళుతున్నపుడు ఓ అమ్మాయి అంది
ఈ వేళ నా దుఃఖభారం కాస్త తీరినట్టుగా ఉంది
దుఃఖభారాన్ని మరింత మోయగలను ..
నీ దోసిట్లోది కాస్త నాకు పంచు అంది....
తలుక్కున మెరిసిన నవ్వుతో
పంచుకోవడం కొత్తగా ఉందంది
మరో అమ్మాయి మురిపెంగా...
బహుశా
ఇక వారి గురుగులకి
కొత్త రంగులు అద్దపడతాయేమో..