అప్పుడప్పుడు
అతను మారు పలకనప్పుడు
నీ నుండి దూరంగా వెళ్లిపోనాయని అడగాలనిపిస్తుంది
పెంకిగా మరీ మరీ అనాలనిపిస్తుంది
నీ నుంచి తప్పుకోనాయని...
ఒకవేళ ...
వెనుదిరిగి అతను తప్పుకోమంటే
నేను ఎలా వెళ్తాను... ఏమైపోతానో
నా కౌగిలిలో మనసారా హత్తుకున్న
బొమ్మను విసురుగా లాక్కున్నట్టు
ఎగిసి పడిన వేదనతో ... వెక్కి వెక్కి ఏడుస్తూ
అడుగు అడుగుకి వెనుదిరిగి చూస్తూ..
తన పిలుపు వినబడనంత దూరం
వెళ్లిపోతానేమోనని బెంగటిల్లుతూ
నాలోని ఊపిరాడని భయం
నిలువెల్లా అల్లుకొని
నేనంటూ ...ఉంటానా
శకలాలై ... రాలిపోతానేమో....
ఓయ్
మరీ మరీ అడిగానని
పట్టుపట్టానని ...బెట్టు చేశానని
మాట వరసకు మాట తూలకు
నిన్ను వీడితే
నా నుండి నేను తప్పుకున్నట్టే
మారు మాట పలకడానికి
ఇక నేనెక్కడ ఉంటాను...