తనది కాంతివంతమైన చూపని
తన మనసు మధురమైనదంటూ
కనబడుతూ ఉంటారు
తెలిసిన మనిషి ఒకరు...
తనదైన కొలత ఒకటి గీటురాయిగా చేసి
మనసు నొకదాన్ని తూకానికి వేయడానికి
తన మనసుకు ఏ మనసు సరితూగలేదని
నిలువెత్తు శాలువా కప్పుకుంటూ
అప్పుడప్పుడు ఎదురవుతారు
తెలిసిన మనిషి ఒకరు....
మనుసు కొలతలు వేయడంలో
మనసుకు గాయం చేయడంలో
కొత్త విద్యలు నేర్చుకుంటూ
తరచూ ఎదురైతూనే ఉంటారు
తెలిసిన మనిషి ఒకరు...
తన చెంత ఉన్న తన మనసుకు
అతుకులు వేసుకుంటూ
కొత్త ధర్మం ఒకటి చెబుతూ
మీకు ఎదురవుతూనే ఉంటారు
తెలిసిన మనిషి ఒకరు...
తడి లేని ఆ కన్నులు
మెరిసే గాజు కన్నులు...
చురకత్తుల్లాంటి మాటలు
మది నిండా నింపుకొని
వెతుకుతూ వస్తారు
తెలిసిన మనిషి ఒకరు...
ఓయ్
నీ మనసు పదిలం
విషపు బాణాలతో
కాచుకొని ఉంటారు
నీ నుంచి నిన్ను వేరు చేయడానికి
తెలిసిన మనిషి ఒకరు...