అప్పుడప్పుడు
కలలు కనే కనులు ముందు
కాఠిన్యాన్ని అరువు తెచ్చుకుంటారు
ఎవరిమీద కోపాన్నో
తన మీద వలకపోసుకుంటారు
వేరెవరో పలకరియ్యలేదని
వస్తూ వస్తూ వారిలోని
చిరాకును వెంటేసుకువస్తారు
తనను తాను పోగొట్టుకుంటూ
మనుషులంతా మారిపోయారంటూ
ఒంటరితనాన్ని కౌగిలించుకుంటారు
ప్రేమ కరువైందని
ఒంటరి భారాన్ని
వీపున మోసుకు
తిరుగుతుంటారు
ఎక్కడో ఒకచోట
మీకు కనిపిస్తూ ఉంటారు
కనిపిస్తే కాస్త పలకరించండి
కుదిరితే
మనిషితనాన్ని కాస్త అప్పుగా ఇవ్వండి
సమూహంలోకి సగౌరవంగా తీసుకురండి
స్మశానపు రాజబాటను చెరిపేయండి సమూలంగా.....