ఏ కొండ గాలి అంచునో...
ఏ సముద్రపు అలలు తీరానో
ఏ మాయ చేసి ..మాట చెప్పి
రంగుల కలలను అందుకొని వెళ్తున్నాడో కాని
పెదవిపై నిండు పున్నమి చిరునవ్వు మెరుస్తుంది
అటుచూడు...
అతని కలలలోని వివశత
నిదుర రాని కళ్ళను
దూర దూరాల వెతికి
వెంట తెచ్చుకుంది...
ఈవేళ
నేను దాచుకున్న కలలన్నీ
అతడు నడిచిన బాటనే
పరుగు పరుగున అడుగెట్టాయి
ఓహ్
అతని కలలు వెండి మబ్బుల తునకలే
ఎంతటి అపురూపతను అద్దుకున్నాయో
అయినా ... ఎందుకో
నా విచక్షణ జ్ఞానాన్ని ఊరవుతల విసిరేసి
దొంగ దారిన అయినా దెబ్బతీసి
అతని కలలను దొంగిలించాలని ఉంది..
క్షమించరాని నేరం చేయాలని ఉంది
అతని కలల వర్ణ చిత్రాలు
మా ఇంటి నిండుగా
వేలాడదీయాలని ఉంది