అదిగో ఆ కొండ అంచున నుంచున్నప్పుడు శిఖరం పై నుండి వినిపించే ఈలపాట.. కొలను గట్టుపై రాలిన పూలసోయగం.. బావి గట్టున ఆ చిన్నదాని జడలోని మల్లెపూల పరిమళం.. అన్నిటిలోని మధురిమంత నిన్ను గుర్తు చేస్తుంది ఎందుకో.
కిక్కిరిసిన రోడ్డుపైన వెళుతున్నప్పుడు చిన్నారి నవ్వు... ఒక్కసారి ఉలిక్కిపడిన నాకు... నువ్వు గుర్తొస్తావు.
అదిగో అతనెవరో రాసిన కథ చదివి వెక్కిళ్లు పట్టి ఏడ్చాను.. అందులో దుఃఖాంతంగా ఏమీ లేవు కానీ ఒడిసిపట్టలేని మృదుత్వం నన్ను ఒక్కసారిగా కమ్ముకుంది అచ్చంగా నీలా...
ఆమె ఎవరో కవిత చదువుతుంది అందులోని వెన్నెల లాంటి పదాలు నా మదిని గాటు పెడుతుంది.. అతను ఎవరో తన ప్రేయసి కోసం గోదారి పాటలు పాడుతాడు.. అందులోని పదాల చిక్కదనం నా మనసును మంచు కవచమై అల్లుకుంటుంది.. వేరెవరో నిదుర రాక అర్ధరాత్రి నాలుగు పదాలు రాస్తారు అందులోని మృదుత్వాన్ని అంతా దొంగిలించుకుని రావాలనిపిస్తుంది...
నేను తిరిగాడే చోటులో కనిపించే మృదుత్వపు ఆనవాలు.. కొన్ని యుగాల నుంచి నాకు పరిచయమైనదిగా అనిపిస్తుంది. అచ్చంగా గతజన్మ పరిచయంగా అనిపించే నీలా.. యుగాలు మారి ఉండవచ్చు.. నా ఉనికి మారి ఉండవచ్చు..పాత వాసన లేవో నాతో పయనిస్తున్నాయి కాబోలు..
మృదుత్వానికి కొలతలు వేయడం సాధ్యం కానిదని మది నాతో వాదనలు చేస్తుంది.. నాకు ఆనవాలు దొరికిన ప్రతి చోటు నుంచి రహస్యంగా కొంత దొంగిలించుకుని రావాలనిపిస్తుంది.. అది నీ ముందు కుప్పగా పోసి, ఇప్పుడు నన్ను జయించు చూద్దాం అని నీకు సవాలు విసరాలనిపిస్తుంది..
అయినా నేను పోగు చేసిన దానిలో పాతదనపు నాటి పరిమళము ఎక్కడి నుంచి వస్తుందోయ్..
నీ మృదుపలుకుల సౌరభం నేను ఏ చోట ఉన్నా నన్ను అల్లుకుపోతూ నీ ఆచూకీ కోసం పరుగులు పెట్టిస్తుంది..
నీ అరచేతులను ఒకసారి తాకానివ్వు నీలోనే మృదుత్వం నా వైపు జాలువారనివ్వు... నీ వెనుక నన్ను అడుగు వేయనివ్వు.....ఈ అనంత సముద్రంలో ఈదులాడే ఈ రంగుల చేపను నీ వలలో బంధించరాదు...ఓ మృదుత్వపు వెన్నెల జాలరి ,.. ఒకసారి రారాదు...