జలపాతంలా మాటలేవో రాలుస్తున్నా
ఏదో ఒక మాట అతని మదిని చేరాలని ..
అతడేమో నాకోసం
మాటలు అట్టిపెట్టుకుంటున్నానన్నాడు..
ఇంతకు
నా మాటల మూటలను
అతని ఖాతాలో జమ వేసుకున్నాడేమో ...
జ్ఞాపకాల బుట్ట బరువైందని
నా బహుమతిగా దాచానని
అనడం లేదు కదా....
అతని మృదువైన వాడే
పిసరంత లోకజ్ఞానం తక్కువ పడింది
నాది.. నీది అనేది మరచి అన్ని దాచడం అలవాటే..
నీకోసమే అంటూ తనను తాను
ఖాళీచేసుకుంటూ అందించడం పరిపాటే..
అందుకే
అతను మౌనంగా ఉన్నా
మదిని చేరే దారి మరిచిపోయినా..
ఒకింత గడుసుతనంతో
పదేపదే నా జ్ఞాపకపు లోగిలిలోకి
లాక్కురావడం నాకు అలవాటేలే...