అతని ఆనందంలో నా ఉనికి
అతని కలలో నా ఆచూకి
కనుమరుగయ్యింది కాబోలు
ఇపుడు
అతనో అందని గాలిబుడగ
రూపు గీయలేని చిత్రపటంలా
అయినా
ఎన్ని చెప్పినా మాట వినదే
బంగారు మాయలేడి తీరుగా
కుదురు లేని నా మది...
అలజడితో ఉన్నాడని
అలసిపోయి ఉన్నాడని
దారితప్పి వెళ్ళాడని
దారి మరిచి వెళ్ళాడని
దావా వేస్తుంది పదేపదే
రామాయణంలోని పిట్టకథలు
భారతంలోని అతివ కథలు
కలబోసి కొత్త కథలు చెబుతోంది
ఎన్ని చెప్పితే ఏమిలే
పగలంతా నా వైపు ఉన్నట్టే ఉంటుంది
అర్ధరాత్రి ఎప్పుడో అతని చెంత చేరి
రంగుల కలలెన్నో ఎత్తుకొని వస్తుంది
ఆ నిముషాన
మా వాదనలన్నీ మరిచి
మదితో కూడి నేను కూడా
ఎపుడు అతని సొంతదారులమౌతామో
అంతు తెలియదు కదా...
ఎంత సిగ్గుమాలిన వాళ్ళమో
అనిపిస్తుంది .. అప్పుడప్పుడు