అతను ఓ లేఖ రాశాడు
మాటలు నేర్చాడు కాబోలు..
రాక్షసి....
అప్పుడప్పుడు నీ అడుగులు
ఎటువైపు వేస్తున్నావో గమనిస్తూ
నీకు తెలియని చోట ఎదురు చూస్తుంటాను
ఎందుకో ఒక్కోసారి నీ మదిలో
యే అలజడులు అలల్లా కదులుతాయో మరి
నీ కనులు నేలచూపులు చూస్తుంటాయి ...
నా మనసు ఒక్కసారిగా బెంగటిల్లుతుంది
అయినా వెనకడుగు వేస్తూనే నీ వైపు చూపు సారిస్తాను
నీ గమనింపులోనే నా చూపులు
నీ మది తలుపులు తట్టి వస్తాయి కాబోలు..
చూపుడు వేలుతో
బెదిరింపు ఆట మొదలుపెడతావు....
నా రాక నీకు ఇష్టమే కదా అని
పెదవి దాటి మాట రావాలనుకుంటుంది ...
వెనకడుగు వేసే ఆటలో నీవు
దిట్టవని తెలిసి మౌనంగా ఉంటుంది...
అవునన్నా కాదన్నా ..
అప్పుడైనా... ఇప్పుడైనా
నీ మది నిండుగా నేనున్నానని తెలుసు
అయినా
ఆరాధన అందుకోమంటావు
వరదలా అల్లుకోవద్దంటూ కట్టడి చేస్తావ్
ఎందుకోయ్ రాక్షసి....