వేకువ పాట ఒకటి నన్ను నిద్ర లేపింది
అద్భుతాన్ని వెతుకుదామని తోడు రమ్మంది
తనతో కలిసి తెలిసిన నాలుగు వీధులు
తెలియని రెండు దారులు కలయదిరిగి
మగత నిదుర కమ్ముకొస్తుందని వెనుదిరిగా....
మారాము చేసి, నేను వెతికి తెస్తే...
భద్రంగా దాస్తావు కదా అని
మరీ మరీ పోరుపెట్టి బయలుదేరింది...
వెళుతూ వెళుతూ
పచ్చని లోయలు ... మెరిసే కొండలు చూసింది
సముద్రపు లోలోతుల్లో అడవి...
ఆకాశంలో పాలపుంతల నగరం ఎదురుపడ్డాయి
ముత్యాల వానను ... పగడాల దీవులు దాటి వెళ్ళింది
కనిపించినవన్నీ అద్భుతం కాదంటూ
వెతికి వెతికి.. వస్తూ వస్తూ నిన్ను తీసుకువచ్చింది
ఓయ్.. నిజమే కదా
వేకువ పాట మెచ్చిన నీవు
నిజంగా అంతటి అద్భుతమే
అధాటున మెలకువ వచ్చింది
నిదుర తడబడి పారిపోయింది....
నా కలలోకి జారవిడిచిన నువ్వు తప్పిపోయావు
వెతకడానికి ఇపుడు ఓ వేకువ పాట కావాలి ..