నేను వెళ్ళిపోతుంటే ఆపి
పలకరించింది నీవే కదా...
కరకుగా ఒక మాట తూలి
కదిలిపోతుంటే కట్టిపడేసింది నీవే కదా..
కలవరపాటుతో నేను వెనకడుగు వేస్తే
విశాలమైదానపు స్వేచ్ఛ తెలిపింది నీవే కదా
జ్ఞాపకాల జావళి ఎంత బాగుందో..
అనంతమైన స్వేచ్ఛలో
నీ ఆనవాలు వెతకడం ..
నీవు ఇటువైపు రాకుండా
తమలపాకు తీగతో దడి కట్టడం ..
మీ ఇంటి గోరింటాకుతో పండిన
నా చేతి ఎరుపులో నిను బంధించడం ..
ఎంత బాగుందో ..
నువ్వు శ్రీకారం చుట్టిన కథకి
నేను సారథి అవడం
ఎంత బాగుందో.....
నువ్వు
అమాయకుడివో ఆరాధకుడివో నాకు తెలియదు కానీ
నేను మాత్రం ముమ్మాటికి నీవు అనుకునే మాటకారినే కదా...