ఒకానొక రోజు
అతిమెత్తగా అడుగులో అడుగులేస్తూ
ఓ కనిపించని గాలితెరను .. తెలియని నీటి తెరను
ఆపై ఇసుక తెరను ..దింపుతూ వెళ్ళాడు ...
ఇక జలతారు తెరను దించినప్పుడు
గమనింపుని దాచుకోలేక అడిగా
తెరలు కడుతున్నావేల అని...
తెరలెక్కడున్నాయి ..అందమైన లోగిలే కదా
అంటూ తెరలు తెరలుగా నవ్వాడు
తెరలు కట్టడం నేర్చుకున్న తెలివైనవాడు
చివరాఖరుకు
కొన్ని మాటలు కొన్ని అలకలు
కొన్ని విసుర్లు.. మరిన్ని నిందలు
సూటిగా నా వైపు విసిరి
ఇనుపతెరను భద్రంగా దింపి
ఇప్పుడు
సముద్రమంతటి ప్రేమ నాదని
ఆర్ధ్రమైన పాట ఒకటి పాడుతున్నాడు
మనసున ఇనపపెట్టలో దాచుకున్న ఓ ప్రేమికుడు