ఒక్క నిమిషం... వస్తాను అన్నాడు
నిమిషం అంటే సమయమా.. దూరమా
ఎలా లెక్కించాలి నాకు తెలిసినట్టుగనా
అతను అనుకున్నట్టుగనా
ఎవరిని అడగను
పిల్లవాడు చేసిన కాగితపు పడవనా
సముద్రపు ఇసుకలో దాగిన తాబేలు పిల్లనా
నిదుర రాని కళ్ళలో వేచివున్న కలలనా
అయినా ఏమని అడగను..
ఇరువురికి తెలియని లెక్క ఒకటి ఉందేమో
ఒక్క నిమిషం .. కొనసాగుతూనే ఉంది
ఏ దూర తీరాన చిక్కుకుందో
ఏ కాలం వడిలో కరిగిపోయిందో...
మరోసారి
వినిపించింది జ్ఞాపకాల లోగిలి నుంచి
ఒక్క నిమిషం .. వస్తాను అని
ఏ వైపునో అతను వేచి ఉన్నాడో
ఈ వైపున నేను వెతుకుతూనే ఉన్నాను
వెతుకులాట ముగిసినప్పుడు
లెక్క తేలుతుంది కాబోలు...