నాలోని మాటలన్నీ ఒకదానికొకటి ఢీకొని
కుప్పగా రాలిపోతున్నాయి
మాటడేవారు ఎదురుపడక.....
రాలిన మాటలు రాశిగా మారి
ఒకదానితో ఒకటి పొట్లాడడం మొదలుపెట్టాయి
మొదటగా నేను వచ్చాను ఈ చోటు నాదంటూ...
సామరస్యపు మాటల మధ్య కోపచాయలు అలుముకున్నాయి ..
పిరికితనంతో కొన్ని ఆత్మహత్య చేసుకున్నాయి
ఒంటరితనం భరించలేక కొన్ని పారిపోయాయి
మరికొన్ని పశ్చాతాపంతో ముడుచుకుపోయాయి
ఇంకొన్ని ద్వేషంతో చంపబడ్డాయి
ఇప్పుడు
అక్కడక్కడ కనీ కనపడని మాటలు
ఎడారిలా మారిన మదిలో..
అప్పుడు మొదలైంది
మనుషుల జాతర కాసిన్ని కబుర్లు చెప్పమంటూ...
నేను
నా నుంచి తప్పిపోయిన మాటలను వెతుకుతున్న
రిక్త హస్తాలతో పదే పదే యాచిస్తున్నా
మీ మదిలోని మాటలు కొన్ని నాకు వంపమని...
ఒట్టిపోయిన మాటలకు కారణమైన మనిషిని
బహుమతిగా మాటలనే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా
మనసు నొప్పించి ... ఒప్పించి
మాటల కోసం అర్రులుచాస్తున్న నేను
మానాభిమానాలు లేని ఓ బాటసారిని ..