గడ్డకట్టిన నది ఎదురయింది
లోలోపల ప్రవాహపు చప్పుడు వినిపించకుండా...
నా పెదవిపై తళుక్కున నవ్వు మెరిసింది
రహస్యాలు దాచడం నేర్చుకుందని...
సడిచేసే చిరుగాలిని చూసి ఇంకా
పసితనం పూర్తిగా పోలేదని
అరమరికలు ఇంకా అలవడలేదని
మనసులోనే ఊరట చెందా ఒకింత
పెద్దరికపు మంచుపర్వతాలు ఎదురయ్యాయి
మనసుకు ఎన్ని గాయాలు తగిలాయో ..
మౌనంగా తనలోకి తను ముడుచుకుని
కరిగిపోతుంది నిరంతరం
తనకు తాను మిగలాలని లేదంటూ
మౌనంగా నా మది కలసిపోతుంది తనతో పాటు...
అయ్యో..
నేను చూస్తున్నది మనుషుల మనసులనో
ప్రకృతి వేదనలో అర్థం కాకుండా
పెనవేసుకుపోయాయి మదిలోని భావాలన్నీ
అయినా
దరిచేరని తీరాలలో... కనబడని బంధాలు
అల్లుకున్న మనిషి .. ప్రకృతికి తోబుట్టువే కదా
ఎక్కడ నొప్పి తగిలినా .. మనసు మిగలని చోట
జరిగేది అలవికాని వైపరీత్యాలేనేమో ..