నిశ్శబ్దాన్ని గాఢంగా పెనవేసుకోవాలని
శబ్దం అటువైపు అడిగేయడానికి
ఉలిక్కిపడేంత నిశ్శబ్దం
నా చుట్టూ దడిగా కట్టాలని...
నిదురబోయిన చీకటిలోకి
అడుగు వెనక అడుగు వేస్తూ
తనతో సావాసం చేయాలని...
గాఢ నిదురలోని చిక్కటి చీకటిని
బుజ్జగించి లేపే వెలుగు రేఖల
అలికిడి లేని శబ్దం వినాలని ...
ఆశతో.. ఆకాంక్షతో అనుకోకుండా
అడుగులేసా అటువైపు...
ఓహ్.. ఆశ్చర్యపరుస్తూ
ఎవరూ లేని చోట
ఓ కాలిబాట అస్పష్టంగా...
ఓయ్
నీవు ఈ వైపుకు ఎలా వచ్చి వెళ్ళావు
నీ అడుగుజాడల వెతుకులాటలో
నా పయనం మొదలవుతుందని
నీ మదికెలా తెలుసు...
ఉష్...తెలిసింది
నన్ను రాక్షసి అంటూ
అతన్ని రారాజు చేస్తూ...
ఎంత గడుసుదో నామది ...
అతనికి గుసగుసగా
ఎపుడో చేరవేసే ఉంటుంది
నాలోని మాటలు..