లెక్కల ట్యూషన్ కి పోలేదని
అమ్మ చింతబరికతో కొట్టింది...
మాట రాని దాని లెక్క గమ్మున ఉన్న గాని
సోపతి పోరగాడి చేష్టలు చెప్పకపోతి..
లెక్కలకు ఆన్సర్ ఎట్లా వస్తదో తెలవకపాయె...
అమ్మకి ఎట్లా చెప్పాలో లెక్క తేలకపాయె
అత్తెసరు మార్కుల పిల్ల చెపితే
ఎవరు నమ్ముతారు అనుకున్నానేమో..
అప్పుడే కాదు ఇప్పుడు కూడా
లెక్క ఆన్సర్ చెప్పనీకి వస్తలేదు..
ఆడపిల్ల చెప్తే ఎవరింటరు.. ఎవరు నమ్ముతారు
సబూద్ గావాలె ... ఒంటిమీద
కానరానిచోట కూడా గాయాలుండాలే
అపుడు మాత్రం అందరూ నమ్ముతరా..
నమ్మించనీకి ఎన్నిసార్లు
మానమే పోవాలో .. ప్రాణమే పోవాలో ..
మనసు మీద మచ్చ పడాలె
జీవితం మీద ఇచ్చ పోవాలె
అయితే మాత్రం నమ్ముతరా..
ఎందుకో...
అప్పటికి... ఇప్పటికీ
లెక్కలే అర్థమైతే లేవు...
అత్తెసరు మార్కుల పిల్లను కదా...
నాకు ఆన్సర్లు తెలుస్తలేవు....