అతను అంటాడు పదేపదే
క్షణం వదలకుండా
నీతో మాట్లాడాలని ఉందని...
మాట్లాడాలనుకున్న సమయం
వాయిదా పడ్డప్పుడు
నీరింకిన ఊట బావినవుతానని
చెప్పకనే చెబుతాడు....
నాతో మాట్లాడాలన్న వేళ
పరిచయస్థులు ఎదురుపడితే
తన సమయాన్ని దొంగిలించారని
అమాయకపు ఫిర్యాదుతో వస్తాడు
ఉచితానుచితాలు వదిలేసి
వేళ కాని వేళ అయినా సరే
తనలోని విజ్ఞతను వివేకాన్ని మరచి
పదే పదే నీతో మాట్లాడాలని ఉందని
అతను అంటాడు చంటి పిల్లవాడిలా
అప్పుడప్పుడు
అతను అంతులేని ఫిర్యాదుల చిట్టాతో వస్తాడు
నేను నిశ్శబ్దంగా అందులోని అక్షరాలను దిద్దుతాను
అవునన్నా... కాదన్నా
ఇరువురం ఒకే పదంలోని
అక్షరాలమే కదా.....