ఎపుడైనా అతను మాటై
నాకోసం వచ్చినప్పుడు
విరజాజి పరిమళంలా
ఎంత బాగుంటుందో ...
అపుడపుడు.. అతడి మౌనం
నా చెంత చేరకముందే...
అతని కన్నుల కాంతి
ఎన్ని రంగులు వెదజల్లుతుందో..
అపుడు చూడాలి నా మోము
తన రూపు మేలిముసుగుతో
అద్దంలో వింత కాంతులీనుతూ
ఎంత బాగుంటుందో...
అతను నిదురై చేరిన వేళ
మాటలు తెలుపని అనురాగంలా
ఓ నిశీధి నిశ్శబ్దం
నను బిగి కౌగిలిలో
బంధించినట్టు....
ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు
అమరవీధుల్లో విహరించినట్టు...
ఎంత బాగుంటుందో....
నిజంగా... ఎంత బాగుంటుందోయ్??
పాలపుంతలోని నక్షత్రాలు
భూమి పై విహరించినట్టు..
సముద్రంలోని మత్సకన్య
గంధర్వ రాకుమారుని వెతికినట్టు...
కథలు కానే కావవి అక్షరాలా
నా మనసు నమ్మినట్టు
ఎంతో బాగుంటుంది మరి.....