నేను ఎక్కడైతే ఉన్నానో.. అదే నా జీవితపు బాట
ఆ మనుషుల మధ్యనే బ్రతుకంతా సాగుతూనే ఉంది
విరబూసిన మమకారం జారవిడుచుకుంది అక్కడే
మనసును జాగ్రత్త చేసుకోవడం నేర్చుకుంది అక్కడే
చెరిగిపోని మమతలు.. చెరిపేసిన గురుతులు
ఒడిసి పట్టిన ఆశలు.. విసిరేసిన నవ్వులు
జ్ఞాపకాల పొదరిల్లు... గాయాల హరివిల్లు
ఎన్నో ఎన్నెన్నో చెరగని అడుగుల్లా అన్ని అక్కడే
నడిచిన దారుల వెంట కలియ తిరుగుతూ
వెతికి వెతికి రంగురంగుల నక్షత్రాలతో మాల కడుతున్నా..
అయినా ఎందుకో.. మనసు నిశ్శబ్దంతో
తెలియని గుబులు గుబులుతో చీకటి రాతిరిన
ఆవేదనంత కుప్పగా పోసి
చలిమంట వేసుకుంటున్నప్పుడు ...
ఎందుకో నాకు అనిపిస్తుంది
నాలోని మృదుత్వపు పదాలను
ఎవరో దొంగిలించారని...