రాతిరెందుకో సంపెంగపూల సౌరభం అద్దుకుంది
అతను ఓ కలకంటున్నాడు...
నది ఒడ్డున నిశ్శబ్దంగా నడుస్తూ
అతని వెనుక అడుగులో అడుగు వేస్తూ నేను
వెళుతూ వెళుతూ రెండు విరజాజి పూలను..
లేత గులాబీ మొగ్గలను తన అరచేతుల్లోకి తీసుకున్నాడు
ఇదివరకు ఎప్పుడో అవి నా చేతులను తాకిన జ్ఞాపకం గుర్తుకొచ్చింది
మరి కొంత దూరం నదిలో తనను చూసుకుంటూ నదితో ముచ్చట్లు చెబుతున్నాడు..
నేను నదిని పలకరించాలనుకున్నాను
అతనిపై నుండి చూపు తిప్పితే కనుమరుగవుతాడని ఎక్కడో గుబులు కాబోలు..
అక్కడి నుండి అతను అడుగు ముందుకు వేయగానే
అప్పుడు తెలిసింది ఇప్పుడు చూస్తున్నది నా కలనే అని...
ఒక్కసారి ఉక్రోషంతో ఓయ్ ఆగు.. ఎవరు నువ్వు..
ఇదంతా నాది.. నా కల .. నాకు ఇచ్చేయి
అని గట్టిగా అరిచారు....
అతను వెనుతిరగకుండానే అవును..
ఇదంతా నీదే... నాతో కలిపి అన్నాడు..
అప్పుడు తెలిసింది
తప్పిపోయిన నా కల అతని చెంత చేరిందని...
ఇంతకు నా కల నా దగ్గరకు వచ్చినట్టా .. రానట్టా