అతను కొత్తగా కనిపిస్తున్నాడు
ఇదివరకు నడవని దారిలో వెళ్లానేమో
సముద్రంలో ఈతరాని చేపల్లె
రంగులన్నీ ఒలకపోసిన పసిపాపల్లె
చందమామలోని కుందేలు పిల్లల్లె
గజిబిజి అడుగుల మధ్య
నా గమనింపు లేక అతను
ఎందుకో అతను కొత్తగా కనిపిస్తున్నాడు
అప్పుడప్పుడు నా ప్రయాణానికి కాగితపు పడవలు
మరొకప్పుడు మనసు ఆహ్లాదానికి మల్లెల మాలలు
ఇంకొకప్పుడు తన అడుగులో నా అడుగులు కలుపుతూ రంగవల్లులు... ఎన్నని చెప్పేది
ఎందుకో అతను కొత్తగా కనిపిస్తున్నాడు
మగత నిదురలో మరిచిపోతానేమోనని మారాము చేస్తే
ఒత్తిగిల్లినప్పుడు తాకేది తన అరచేయేనంటాడు..
నిను చేరే దారి మర్చిపోతున్నానంటే... ఏ దారిన వచ్చిన ఎదురుపడే ఆట నేర్చుకున్నాను అన్నాడు..
కలలాగా రోజు కరిగిపోతుంది
ఎందుకో అతను కొత్తగా కనిపిస్తున్నాడు...