తను వచ్చి వాకిటి నుంచొని అందరూ
ఒంటరిగా వదిలేశారని బేలగా అంది
ఒక్క వుదుటున నా కౌగిలిలో బంధించాను
అగ్నిశిఖలా నా శరీరాన్ని ఎర్రగా కాల్చివేసింది
కన్నుల్లో నీరు ఆవిరైపోయి ఎర్రబడ్డాయి
కాళ్లు చేతులు అదుపుతప్పి నిస్సత్తువగా మంచంపై వాలిపోయా..
నా అన్న వాళ్లంతా చుట్టూ చేరారు
నాలుగు మాత్రలు వేశారు
గ్లాసులు పాలు ఇచ్చారు..
కాళ్ళకు మర్ధన చేశారు ...
నుదుటిన తడిగుడ్డ వేశారు..
నేను కలవరిస్తూ పలవరిస్తున్నా..
అతను వస్తే బాగుంటుంది
వస్తూ వస్తూ వెన్నెల దుప్పటి తెస్తాడు
అతడు వస్తే బాగుంటుంది అంటూ
చిన్నగా రణగొణ ద్వని.. అప్పుడే తెల్లారింది
ఎంత గాభరా పెట్టేసిందో
జ్వరం వదిలింది అన్నారు..
సేదతీరిన జ్వరం తెప్పరిల్లుకొని
గడప దాటి వెళుతుంది
చిరునవ్వులు చిందిస్తూ..
అయ్యో.. ఒట్టి చేతులతో వెళ్ళిపోతుంది
అతను వస్తే బాగుండు
వెన్నెల దుప్పటి తెస్తాడు
వచ్చి ఉంటే బాగుండేది..
వెన్నెల దుప్పటి ఇచ్చి పంపేదాన్ని
అతను వచ్చి ఉంటే బాగుండేది కదా!!