చెదరని రంగు

సముద్రపు ఒడ్డును తాకుతున్న
అలలను ఎన్నో ఎన్నెన్నో..

అందులో ఓ అల
నిశ్శబ్దంగా నిశ్చలంగా నీకోసమే వచ్చాను
అంటూ తాకి తాకకుండా నీ పాద స్పర్శను
ముద్దాడి వెళుతుంది నింపాదిగా చూడు..

.ఎప్పుడో ఒకప్పుడు
ఆకతాయితనపు అలయై
నిలువెల్లా తడిపేస్తుంది మరి..

ఆచూకీ కోసం ఆరా తీయకు..
అలకబూని ఆఖరి కెరటంగా
అవుతుందేమో......

ఎందుకైనా మంచిది..
తెలిసి తెలియనట్టు గుట్టుగా ఉండు
నిను ఆట పట్టించడం ఇష్టం కదా
మళ్ళీ మళ్ళీ నీ చెంతకు చేరుతుంది
పదేపదే నిన్ను నిలువెల్లా తడిపేయా..

మళ్లీ చెప్తున్నా
పదేపదే వస్తుందని పరుగులు పెట్టమాకు
చూసి చూడనట్టు దూరంగా ఉండు

నువ్వో మోహపురంగుల హరివిల్లువాయే
దరిచేరితే రంగు వెలుస్తుందేమోనని
ఒకింత కలవరమేకదా.. నా మదిలో

ఇప్పుడు నీ ఊహలకు అందేంత
మంచిదానను కాదోయ్ మరి....

నేనో చెదరని రంగు అయ్యేవరకు
కాస్తంత వేచి ఉండవోయ్...

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!