మౌనంగా ఉండమన్నాడతను
అతని మాటమీర లేదు
మౌనాన్ని వీడలేదు
అయినా
నా మనసు అతని జ్ఞాపకాలతో
ఆకాశంలో వర్ణ చిత్రాల్ని గీస్తూ
అతని ఆనవాళ్ల సొగసు అతికిస్తూ
సందడి చేస్తుంది..
బహుశా
ఆ రణగొణ ధ్వని
అతని మనసును తాకిందేమో..
అస్తవ్యస్తమైన పనుల్లో ఉన్నాను
మౌనంగా ఉండమన్నా కదా
మరోసారి చెప్పాడతను..
కాస్త మంచి దానినే కదా
మాట మీరను కదా!!
అయినా
కనికనం లేని మనసు
కలత నిదురలో
అల్లరి చేసింది
బహుశా
కలవరపాటు కలలా
అతన్ని తాకింది కాబోలు
ఈసారి
ఎరుపు నిండిన కళ్ళతో
నేను వర్షపు చుక్కను ఆహ్వానిస్తే
నదిపై వచ్చావెందుకు....
ఆక్రోశంతో అన్నాడతను...
అతనిలో బేలతనం..
చేరువై అల్లుకుపోవాలనుకున్నా..
అతను సముద్రుడే కదా
నదినని నన్ను అక్షేపిస్తాడెందుకో ..
బహుశా
అతని మనసుకు గమనింపు
ఇంకా రాలేదు కాబోలు
అయినా
నేను కాస్త మంచిదాన్ని కదా!!
అతని మాటమీర లేదు
మౌనాన్ని వీడలేదు..
మనసుకు సంకెళ్లు వేయలేదు...