అతను మూలమలుపు పై
ఒక అడుగు ముందుకేసి వెనుదిరిగాడు
మలుపు నుంచి కనిపించే ఇల్లు మాదే కదా
నాకెందుకో మూలమలుపు
రోజురోజుకీ పెరుగుతున్న
పర్వత శిఖరంయై నిలుస్తోంది
ఒకానొక సాయంసంధ్యలో
అడుగుల సవ్వడితో
ఓ చిరునవ్వు వినిపించింది
తత్తరపాటుతో లేచి నిల్చుంటే
ఒడిలోని పూలు రాలి
అతని పాదాలు ముద్దాడాయి
రాలిన పూలను అందిస్తూ
తన చేతి పిడికిలి విప్పాడు
అరచేతిలో అపురూపంగా
కనపడకుండా పోయిన
నా తాటాకు బొమ్మ...
అప్పుడు..
పాత పుస్తకంలో దాచిన నెమలీక
కథ చెప్పటం మొదలెట్టింది
నేను కన్వాశ్రపు శకుంతలను
మరి అయితే అతను
అచ్చంగా.....
నాకై వచ్చిన అతనే కదా..