పొద్దునే నడిచే దారిలో
చిన్న పలకరింపు
మాట ఎదురవుతుంది..
హచ్ కుక్కపిల్లలా
నా వెనకే తిరుగుతూ
ఇంటి దాకా చేరుతుంది
పలకరింపు మాట అలసి
పక్కకు తప్పుకోక ముందే..
ఫోను మోతతో
మరిన్ని మాటలు
ఎదురు చూస్తుంటాయి
ఏం చేస్తున్నావు అంటూ మొదలై...
కొన్ని నవ్వులు.. చిరు కోపాలు
దోసిట్లో ఒదిగిపోతాయి
ఏదైతేనేం ఎన్నో మాటలు
రెక్కలు కట్టుకొని
నా పక్కన చేరతాయి
పనిలో సాయం చేస్తామంటూ
సాయానికి వచ్చిన మాటలు
అలసి నిద్రపోక ముందే...
టీవీ మోతల మాటలు కొన్ని
పక్కింటి మాటలు మరిన్ని ..
మనసు మాటలు
మనసైన వారి మాటలు ఎన్నెన్నో..
మాటలన్నీ మది వీడక
పట్టు దారంలా
సుతిమెత్తగా
నా చుట్టూ అల్లుకుంటూ
నిదురించే
కలల మాటలకు
రాజబాటలు వేస్తున్నాయి
ఏదేమైనా
మనిషి మీద .. మాట మీద
కాస్త మక్కువ ఎక్కువే నోయ్...
క్షణం వీడని నీ అనురాగంలా....