అతనో విహారి కాబోలు..
సంపూర్ణ చిత్రానికి రంగులు అద్దమంటాడు
మనుషులులేని చోట రాగాలు ఆలపించమంటాడు
చలమలోని నీటిని దోసిలిలో దాచమంటాడు
అతనో భావకుడు కాబోలు..
మేఘాలతో పయనించమంటాడు
చందమామకు కథలు చెప్పమంటాడు
నక్షత్రాలతో చెలిమి చేయమంటాడు
అతనో విరాగి కాబోలు...
కళ్ళలోని మెరుపు చీకటికి అరువు ఇవ్వమంటాడు
మనసులోని ఊసులు ఆకాశాన వెదజల్లమంటాడు
చిరునవ్వుల సోయగం ధరణికి ధారపోయమంటాడు
అందించేవి అరుణ కిరణాలంటాడు
దోచుకెళ్ళేవి చీకటి కోణాలంటాడు
ఎవరితను .. ఎవరివాడు ఇతను...
ఏమో....అతని మాటలకి
అర్థమే అందలేదో
అర్థమే....లేదో..