బహుశా...

ఈ కవిత నేను నవ్య వార పత్రికలో చూసాను. ఈ కవిత చూడగానే ఎందుకో ఒక కథలోని సంఘటన ఆలా మదిలో కదిలింది. రుక్మిణి శ్రీ కృష్ణుడికి లేఖ వ్రాసిందట... నా సోదరుడు, నా తండ్రి గారు నా వివాహం నిశ్చయించారు. వారి మాట దిక్కరించలేను, వారిని దూషించి, వారిని ఎదిరించి, వారిని అమర్యాద పాలు చేయలేను. నాకు తెలిసినది మిమ్మలిని నిరంతరం ప్రేమించడమే, నా ప్రేమ నన్ను వీడి నీతో అల్లుకోపోయి ఉంది. నా ప్రేమ లేకుండా నీవు ఉండజాలవు, అందుకని నీవు నాన్ను వివాహమాడమని  అంటూ విన్నపం  పంపిందట....

రుక్మిణి ఎక్కడా నీవు లేకుంటే నేను ఉండలేను అనలేదట..నా ప్రేమ లేకుండా నీవు ఉండలేవు, నా ప్రేమించడం మాత్రమే వచ్చు, ఆ ప్రేమను పొందడంలోని మాధుర్యం వీడి ఉండలేవని చెప్పకనే చెప్పింది..అలాంటి రుక్మిణి లాంటి అమ్మాయి ఈ కవితలో కనిపించింది  యిలా.....

బహుశా ....

సీతను పెళ్ళాడాను
శ్రీరాముణ్ణి కాలేదు
ఆమె మన్ననలు పొందాను
దేవుణ్ణి కాలేదు
ప్రేమంటే అదేనేమో - -

అమృతం తాగినట్టున్నాను
నిజానికి
సీతే నన్ను పెళ్ళాడింది
దేన్నీ ఆశించలేదు
ఎడారి దారిలో
నీడలా దొరికింది
నేను ఏది దాచుకోలేదు
దీన్నే సాక్షాత్కారమంటారేమో - -

అడగకుండానే కడుపు నిండింది
కవిత్వం రాస్తాను
కల్లా కపటం తెలియదు
రాజాలా తిరుగుతాను
ఒంటరిగా బతకలేను
ఆమె అందర్నీ వదిలి వచ్చింది
నేను దూరంగా ఉండలేను
స్నేహమంటే ఇదేనేమో - -

ప్రయాణమింత హాయిగా ఉంది
పెళ్ళికి ముందు
నా సంపాదన అడగలేదు
పెళ్లి తర్వాత
నేను అపడ్డం చెప్పలేదు
బతుకంటే నమ్మకమేనేమో  - -

అందుకే ఆత్మీయత అలముకొంది
నా రూపం చూసి
ఆమె మోజుపడలేదు
ఆస్తిపాస్తులు లేవని
నిరాశా చెందలేదు
మరి ఏమీ లేని చోట -
ఎందుకు వెలసింది?!

బహుశా - -
తల్లిలేనివాడినని
దగ్గరగా తీసి ఉంటుంది.

- - ఆశారాజు(cell..9392302245)


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!