నిండు పున్నమి వెలుగుల్లో ఉవ్వెత్తున ఎగిసే సంద్రపు కెరటాల్లోని చైతన్యాన్ని కలగన్నాను..
పరవళ్ళు తొక్కుతూ హుషారుగా పరుగులు తీసే కొండవాగులోని చురుకుదనాన్ని కలగన్నాను.
తొలిపొద్దులో పచ్చటి చివుర్లపై నిలిచిన మంచు ముత్యాలని చుంబించే తూరుపు రేఖల్లోని చిలిపితనాన్ని కలగన్నాను..
కన్నె పూమొగ్గపై అల్లరిగా వాలిపోయి మధుర మకరందాన్ని గ్రోలే తుంటరి తుమ్మెదలోని కొంటెతనాన్ని కలగన్నాను..
నా అరచేతిలో ఎర్రగా పండిన చందమామ లాంటి అందమైన మోముని కలగన్నాను..
నల్లటి చీకటి రాతిరిలోని చుక్కల్లా కాంతులీనుతూ నను మురిపించే కన్నులని కలగన్నాను..
నా దోసిలి నిండుగా పున్నాగాల పరిమళాలు నింపేసే తెల్లటి తేటైన నవ్వుని కలగన్నాను..
నా కొంగు చాటున దాగుతూ నా ఒడిలో చేరి గారాలు పోయే పసితనాన్ని కలగన్నాను..
నను మాటల మాయలో పడేసి చెక్కిలిపై ముద్దుని దోచుకెళ్ళే గడుసుదనాన్ని కలగన్నాను..
గోదారి తీరాన వెన్నెల వానలో తడిసి ముద్దైపోయిన అనుభూతిని తలపించే మోహాన్ని కలగన్నాను..
నను అనునయంగా చేరదీసే బలమైన బాహుబంధంలో ఒదిగిపోయి ప్రపంచాన్ని మరచిపోవాలని కలగన్నాను..
నా మనసుకి సీతాకోక చిలుకలా రెక్కలొచ్చి స్వేచ్ఛగా నింగి దాకా ఎగరాలని కలగన్నాను..
చుక్కల పూదోటలోకి విహారానికి వెళ్ళి ఆ మెరుపులతో నా చీర చెంగు నింపుకోవాలని కలగన్నాను..
ఆకాశమంత ప్రేమలో మమేకమయిపోయి నేననే నేను మాయమైపోవాలని కలగన్నాను..
ఊపిరాగిపోవాలనిపించేంత గాఢమైన కౌగిలిలో చిక్కుకుపోయి కరిగిపోవాలని కలగన్నాను..
నా కలలేవీ నిజమవ్వలేదనుకున్నాను.. కలలు నిజాలవుతాయా ఎక్కడన్నా అని సరిపెట్టుకున్నాను..
కానీ.. నన్ను నాకే అపురూపంగా చూపిస్తూ నా కలలన్నీ పండిస్తూ నువ్వు నా జీవితంలోకి నడిచి వచ్చావు..
మరీ.. బదులుగా నన్నంతా నీకిచ్చేస్తాను... ఎప్పటికీ నాతో ఉండిపోవూ..!