నిజ జీవితంలో మనము మన పాత్ర

మనకి ఎదురైన ఏదో ఒక విషయం లో మంచి  లేదా చెడు ఏదైనా కానీ  అవతలివాళ్ళు మనం అనుకున్నవిధంగా స్పందించడం  లేదని.. "వీళ్ళు ఎందుకిలా ఉన్నారు ,ఇలా ఎందుకు చేయడం లేదు  " అని వాపోతాము, మనమూ  అదే పరిస్థితిల  లోకి రాగానే ఎందుకు చేయలేకపోయమో చెప్పుకోడానికి కారణాలు వెతుకుతాము ...

ఇలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడు ఎదురు కాలేదా..మీకెప్పుడు ఒక సంఘటన జ్ఞాపకంగా మారిన తరువాత " ఆ రోజు యిలా చేసి ఉండాల్సిందేమో అని" అనిపించలేదా? మీ చిన్నప్పటి నుండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి...మనమేదైనా తప్పు చేసినప్పుడు అమ్మో,నాన్నో  పట్టుకొని బాదేస్తే , "ఛి ఏంటి వీళ్ళు ఇలా కొడుతున్నారు ,నేను అయితే యిలా చేస్తానా." అని, లేదా మనం చేసే తప్పుకి ఆసరాగా ఉండని స్నేహితులని వదిలేసినవి..ఇలాంటివి ఎన్నో..

సచిన్ టెండూల్కర్ ని చూసి చూడరా వాడు ఎంత పెద్ద ఆటగాడో , నువ్వు చదువుకోకపోతే నాశనమైపోతావనే తండ్రికి, సచిన్ కి  వాళ్ళ  తండ్రి ఎలాంటి చేయూతా  ఇచ్చాడో గుర్తించాలని  తెలీదా?   తన చెల్లి ని ఎవరైనా ప్రేమిస్తే  కోప్పడే అన్న..తను ప్రేమించేపుడు  ఆ అమ్మాయికూడా  ఒకరికి చెల్లలే(ప్రేమించడం తప్పు కాదు,అది ప్రేమో కాదో తెల్సుకోకపోడం తప్పు ) అన్న విషయం మాత్రం గుర్తు రాదా..  తన తల్లితండ్రులకి  తెలీకుండా ఇంకోర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ,తను తల్లి అయ్యాక అదే పని తన కూతురు చేస్తే నిలదీయడానికి అర్హురాలు ఎలా అవుతుంది..కనిపించిన ప్రతి ఆడదాన్నివయసుతో సంబంధం  లేకుండా    వక్రదృష్టి తో చూసే తండ్రి , యుక్త వయస్సు లో ఉన్న కూతురి మీద కేకలు ఎందుకు వేస్తాడు ? వయస్సు మీరిన తల్లి తండ్రులని నిర్లక్ష్యం చేసే పిల్లలు , వయసు మీద పడ్డాక పిల్లల్ని విసిగించే పెద్ద వాళ్ళు(ఇది చాల పెద్ద విషయం ,అన్ని ఉండి అందరు ఉండి ఈ వయసు లో వాళ్ళు అనాధలౌతున్నారు.తమ అనుభవాన్ని పంచుకునే పసి హృదయాలు "ముసలాళ్ళు మీకెందుకు మీపని మీరు చూసుకోక " అనే చీత్కారాల్ని పడుతూ చావు కోసం ఎదురు చూస్తున్నారు. ). ఇందులో ప్రతి పాత్ర ని మనం పోషించాలి.

ఒక మనిషిలో ఇన్ని విరుద్ధమైన ఆలోచనలు ఎందుకు ఉంటాయి.వీళ్ళంతా చెడ్డవాళ్ళా?స్వార్ధపరులా?  మన దైనందిన జీవితం లో ఇలాంటి  వాళ్ళని చూస్తూనే ఉంటాం. కొన్ని విషయాలు మనలోనే ఉంటాయి... అప్పుడు మొదటి మెట్టు దాటి రెండు మెట్టు కి వచ్చాక ,ఎందుకు న్యాయం చేయలేకపోయమో చెప్పడం కంటే దానికి కారణాలు వెతుకడం లోనే ఎక్కువ ఆశక్తిగా ఉంటాము..ఇదే పని అవతలి వాళ్ళు చేస్తే .వాళ్ళు తప్పు చేస్తున్నారని తెగ ఇదైపోతాం.

కన్న కూతురి/కొడుకు ప్రేమను కాదన్న అమ్మ, సీరియల్/సినిమాలో ప్రేమ జంట ఒక్కటి కావాలని పడే తపన ...
ఇంట్లో కోడలిని/అత్తని బాధపెడుతూ సీరియల్ లో కోడలి/అత్త బాధని చూసి కన్నీళ్లు పెట్టుకునే అత్తాకోడళ్ళు.
తన ప్రేయసి/ప్రియుడు ఇంకోరి వంక చూస్తే అదో పెద్ద తప్పు ,అదే వీళ్ళు ఎవరితో ఐనా కిందామీద పడితే  అది సరదాగా తీసుకో మంటారు.
.....ఇవన్నీ టి.వి. సీరియల్స్ లొ చూసి, నేను ఐతే న్యాయంగా ఉంటాను.."చీ ..అలాంటి అత్తగారిని లేదా అలాంటి మనిషిని కాదు అని అనుకుంటారు" కానీ అది ఎంతవరకు నిజం..లిప్ సింపతీ  చూపించడం అన్నిటికంటే చాలా సులభం..

ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.ఎందుకిలా?ఇదేం పెద్ద సమస్య కాదంటారా?...ఖచ్చితం గా ఇది ఒక సమస్యే.దాన్ని పోగొట్టాలంటే అది ఒక్క రోజులో జరగదు.ఒక వేళ అలా ఎవరినైనా సరిదిద్దాలని చూస్తే అది ముదరడమో,లేదా ఆ వ్యక్తి మీకు దూరం గా జరగడమో జరుగుతుంది.

పైన చెప్పిన విషయాల్లో ఒకరి మంచి గురించి ఆకాక్షించి చెప్పేవే అన్ని.
పిల్లల బాగు  కోరి కొట్టే తల్లి తండ్రులు(కొడితే మారిపోతార అనకండి , తగు మోతాదు లో కఠినత్వం చూపకపోవడం కూడా తప్పే  ) . ఈడు జోడున్న పిల్లలు కలవాలన్న తపనను చూపించే పెద్దవాళ్ళు. కొడుకు గొప్పవాడు కావాలని ఆశపడే తండ్రి,కూతురు మోసపోతుందేమో అని భయపడే తల్లి.

ప్రతి మనిషిలోను మంచి ఉంది.కాని అది పక్క వాళ్ళ మీద రుద్దడానికే అనిపిస్తుంది కదా?
ఎంతమంది తల్లి తండ్రులు ఆదర్శంగా నిలబడుతున్నారు.పిల్లలకి అర్ధమయ్యేలా చెప్పగలుగుతున్నారు? అంత ఓపిక , సహనం,పిల్లలతో గడపడానికి సమయం ఈ తరం తల్లి తండ్రులకి ఉంటున్నాయా? ఇందులో తల్లి తండ్రుల పాత్ర ఎంత ...పిల్లల బాధ్యత  ఎంత....

ఇది ఎవరినీ తప్పు  పట్టాలని చెప్పడం లేదు...ఇది మన సమాజం లో ఇంకిపోయిన నిజం.కాని ఎవరినైనా ను ఇది కదా అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ,అంతెందుకు నేనే ఒప్పుకోను. కాని ఖచ్చితం గ చెప్పగలను అది మీ అస్తిత్వాన్ని ఎప్పటికైనా ప్రశ్నిస్తుంది..అది మీ పిల్లల రూపం లో నో ,భార్య/భర్త గానో, ప్రియురాలు/ప్రియుడి గానో ,వయస్సు మీరిన తల్లి తండ్రులు గానో ...ఎందుకు చెయ్యలేకపోతున్నమో కారణాలు వెతుక్కునే కంటే,ఆదర్శవంతమైన తల్లితండ్రులుగా,బాధ్యత కలిగిన కొడుకు/భర్త (బాధ్యత కలిగిన భర్త అని ఎందుకు అన్నానంటే బాధ్యత లేని మొగుడిని ఎ భార్య భరించలేదు )గా, అన్న గా,  ఒకరి కోసం ఒకరు బతికే ప్రేమికులుగా ,తల్లితండ్రుల కష్టాన్ని గుర్తెరిగి నడుచుకునే పిల్లలుగా ..మనం నిర్వర్తించే ప్రతి పాత్ర ని నైతిక విలువలు,ప్రేమ,బాధ్యత ల తో నింపి మనం నడుచుకుంటే మనకి దేశం నాశనం అయిపోతుందంటు బాధపడే బాధ తప్పుతుందేమో కదా?

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!