ఆషాడం

అమ్మకు ఫోన్ చేసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ" ఆషాడం వస్తుందిగా మరి ఆ అమ్మాయిని పుట్టింటికి తీసుకు వచ్చేసారా అమ్మా" అన్నాను......"ఈ రోజుల్లో ఇంకా ఆషాడం ,కార్తీకం ఏమిటే నీ మొహం పెళ్ళయిన మూడోరోజే సెలవు లేదని అబ్బాయి ఢిల్లీ కి అమ్మాయి బెంగుళూరికి వెళ్ళిపోయారు" అంది.....అసలు ఈ ఆషాడం ఎందుకు పెడతారో తెలియదుకాని ... ఆషాడం అంటే ఎన్నెన్ని సరదాలు, ఎన్నెన్ని విరహాలు ,ఇంకెన్ని సాహసాలు మొత్తం వెరసి బోలెడు జ్ఞాపకాలు .... అవన్నీ ఈ బిజీ రోజుల్లో చాలామంది మిస్ అయిపోతున్నారే పాపం అనిపించింది...అసలు నా జాజిపూలలో ఎప్పుడో రాసుకోవలసిన పేజీ ఇది ....అమ్మ గుర్తుచేసేవరకూ అలా ఎలా మర్చిపోయానో... నేను వెలుగు వెనుకకు వెళుతున్నాను మీరు జాగ్రత్తగా రండి..:)

పెళ్ళయిన నాలుగు నెలలకు మాకూ ఆషాడం నెల వచ్చేసింది ....అప్పటివరకు తనని విడిచీ ఎక్కడికీ వెళ్ళలేదు.. డిగ్రీ ఎక్జాంస్ కని పది రోజులు మా ఇంట్లో ఉన్నాను కాని అందులో వారం రోజులు తను కూడా మా ఇంట్లో ఉండటం వల్ల అంత ఏమీ తెలియలేదు ..కానీ ఈసారి ఆషాడం ...ముప్పై రోజులు.... దాదాపు నెల ...అమ్మో అని దిగులోచ్చేసింది ...నేను లేకపోతే పాపం తను ఎలా తింటారో ?ఎలా ఉంటారో? అని ఒకటే బెంగ (అక్కడికేదో నేనే చిన్నప్పటినుండి పెంచి పోషించినట్లు అబ్బో తెగ ఫీల్ అయిపోయేదాన్ని) ఇంతకీ ఇదంతా నా సైడే... మా ఆయనగారు మాత్రం ఎంచక్కా అసలేం పట్టనట్లు ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతున్నారు.. ... నాకు గొప్ప ఆశ్చర్యం వేసేసింది..... లెక్కప్రకారం ....ముప్పై రోజులు నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను.... నువ్వు నా ఊపిరి ..నువ్వే నా జీవతం..నిన్ను విడిచి నిమషం అయినా నేను ఉండలేను బుజ్జీ ఉండలేను ...అక్కడ నీ ఆరోగ్యం జాగ్రత్త ...సరిగ్గా తినకపోతే నా మీద ఒట్టే .... ఇలాంటి మాటలు చెప్పాలికదా... అబ్బే... అసలేం తెలియనట్లు ... ఇది పెద్ద విషయం కానట్లు చాలా మామూలుగా ఉన్నారు .. (ఇప్పటికర్ధం అయ్యిందా నా బాధేంటో)


సరే మొత్తానికి నాన్న నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు ...రైల్వేస్టేషన్ లో నిన్చున్నాం ... ఉహు ..మా ఆయనమాత్రం ఎప్పటిలాగే జోక్స్ ,కబుర్లు నాన్నతో... వొళ్ళు మండిపోతుంది గాని ట్రైన్ వచ్చే టైం అవుతుంది అని నేనే ముందు మొదలుపెట్టేసాను అప్పగింతలు .... ఏమండీ ,మరీ ...అన్నం వేళకు తినండి అంటూ .... అబ్బా అదంతా నేను చూసుకుంటానులేవే ..నువ్వు హేపీగా మీ వాళ్ళతో ఎంజాయ్ చేసిరా అన్నారు... ఇహ ఆలసించినా ఆశాభంగం అనుకుని మరి మీకేమి అనిపించడం లేదా నేను వెళుతుంటే అన్నాను... అనిపిస్తుంది ..ఎంచక్కా మేడ ఎక్కి నా పెళ్ళాం ఊరెళ్ళి పోయిందోచ్ అని అరవాలని ఉంది అన్నారు నవ్వుతూ ...నాకు తిక్కరేగిపోయింది అయినా తమాయించుకుని ' నిజంగానా' ఒక కనుబొమ్మ పైకి ఎత్తి మరీ అన్నాను .... నిజంగానే ..లేకపోతే ఒక్కటే నస అత్తాకోడళ్ళు ఇద్దరు.. అమ్మాయి ఎదురు చూస్తుంది ఎప్పుడు ఇంటికోస్తావు అని ఆవిడా.. స్నానం ఎప్పుడు చేస్తారు ? టిఫిన్ చల్లారిపోతే బాగోదు ఇప్పుడే తినండి ...బ్రెష్ చేయకుండా టీలు కాఫీలేంటి చండాలంగా ... ఈ రోజు ఎందుకు లేటుగా వచ్చారు ...అని నువ్వు ... ఇలాంటి సుత్తి గోల ఉండదు హాయిగా నాకు నచ్చిన టైముకి రావచ్చు , నచ్చినపుడు తినొచ్చు అసలు ఈ ఆషాడం పెట్టేదే పెళ్ళయిన తరువాత కోల్పోయిన స్వేచ్చను మళ్ళీ రుచి చూపించడానికి అన్నారు... పదండి నాన్నా విసురుగా అనేసి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాను ....


దారంతా ఏడుపోచ్చేస్తుంది కానీ నాన్న ఎదురుగా బయటపడితే మరీ చండాలంగా ఉంటుంది అని కళ్ళు మూసుకుని పడుకున్నాను ....అసలు నేతి బీరకాయలో నేయి ఎంతో మా ఆయనగారి దగ్గర బావుకత్వం అంత ... ఇంటికి వెళ్ళగానే మా గ్యాంగ్ అందరినీ చూడగానే ఓ నాలుగు రోజులు అసలు నాకు టైమే తెలియలేదు ....పైగా అదే సమయంలో నాఫ్రెండ్స్ చాలా మంది ఆషాడం పేరుతో మా ఊరు వచ్చేయడం వల్ల ఒకటే కబుర్లు ....వారం రోజులకు మా ఆయన నుండి ఫోన్ ... అక్కడికి వెళ్ళగానే నన్ను మర్చిపోయావా ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు అన్నారు కోపంగా.... దెబ్బకి మనకో భయంకరమైన సత్యం తెలిసిపోయింది.....


అమ్మాయిలూ దగ్గరకు రండి మీకు మాత్రమే చెప్తాను( ఈ మగవాళ్ళు ఉన్నారే ..వీళ్ళను పట్టించుకోనంత సేపు మన చుట్టూ బొంగరం తిరిగినట్లు తిరుగుతారు ....అబ్బో మనం నవ్వినా ,దగ్గినా ,తుమ్మినా భావుకత్వం భారీ లెవల్లో ఉప్పొంగిపోతుంది వాళ్లకు ..... ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు.... ఒక్క సారి తలవొంచుకుని తాళి కట్టించుకున్నామా అంతే సంగతులు ...మళ్లీ మన మొహం చూడరు.... ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ చుట్టూ తిరుగుతాం కదా అదీ లోకువ... కొన్నాళ్ళకు విసుగొచ్చి ఎహే పో అని వదిలేస్తాం చూడండి అప్పుడు మళ్ళీ నువ్వు అసలు నన్నుపట్టిన్చుకోవడంలేదు అని ఏడుపుమొహం పెడతారు.. అదీ సంగతి)


సరే గ్రహాలూ మనకు అనుకూలంగా ఉండటం వల్ల మనం చెలరేగిపోయాం .... ఆహా..మీరు మేడలూ గోడలు ఎక్కడంలో బిజీగా ఉన్నారుకదా డిస్టర్బ్ చేయడం ఎందుకనీ అన్నాను తాపీగా.... ఏడ్చావులే గాని బట్టలు సర్దుకో మనం హనీమూన్ కి వెళ్ళలేదుగా అందుకే ఎల్లుండి వైజాగ్ వెళుతున్నాం అన్నారు సంబరంగా .... ఆషాడంలో హనీ మూన్ ??అదీ వైజాగ్ కి ...అన్నాను వ్యంగ్యంగా .... అబ్బా అది కాదు బుజ్జీ మా ఇన్స్టిట్యూట్ ఉందికదా ,దాని తరుపున ఏవో మొక్కులున్నాయి మా ఫ్రెండ్ ,వాళ్ళ భార్యా వైజాగ్ ,అన్నవరం వెళుతున్నారు .. అందుకే నీకు కూడా టిక్కెట్ బుక్ చేసేసా అన్నారు....అయ్యా మహాశయా ... ఇలా ఫ్రెండ్స్ తోని పక్కింటి వాళ్లతోని గుళ్ళు, గోపురాలు చూడటానికి వెళితే దాన్ని హనీమూన్ అనరు తీర్ధ యాత్రలు అంటారు అన్నాను కోపంగా .... అబ్బా ఏదో ఒకటిలే ఈ సమయంలో హనీమూన్ అంటే మీ నాన్నా అదిరి అల్లాడిపోయి ,ఏంటీ అల్లుడూ !!!ఆషాడంలో అమ్మాయిని పంపాలా అని జజ్జనకజ్జనక డాన్స్ వేస్తారు... ఇలా గుళ్ళు గోపురాలు అంటేనే సేఫ్ ... ఎల్లుండి రెడీగా ఉండు అన్నారు .... ఏంటి ఉండేది , ఆషాడం లో మీరు మా ఇంటికి నేను మీ ఇంటికి రాకూడదు తెలుసా ఆ విషయం ... పైగా ఆ ట్రైన్ మా ఊరినుండి వెళ్ళదు ఎలా కుదురుతుంది అన్నాను ... అందుకే ఇంకో ప్లాన్ ఉంది ...నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ...అక్కడ ఈ ట్రైన్ ఆగుతుంది అన్నారు .... ఆహా ఇలా పిచ్చి ప్లాన్లు గట్రా వేసి మీరు సేఫ్ గా ఉండండి నేను మా నాన్న దగ్గర పిచ్చి తిట్లన్నీ తింటాను... ఏం అక్కరలేదు ....మీరు ఎంచక్కా మీ మేడ ఎక్కి అరుచుకోండి అన్నాను విసురుగా...బుజ్జీ బుజ్జీ బుజ్జీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఇది నీకు నేను పెడుతున్న ప్రేమ పరీక్ష అనుకో ... మీ నాన్నను ఒప్పించి ఎల్లుండి అమ్మమ్మ ఇంటిదగ్గరకు వస్తే నువ్వు పాస్ అయినట్లు అన్నారు... అయితే నేను ఫెయిల్ అయ్యా అనుకోండి ఏం పర్లేదు అని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాను ఎలా నాన్నకు ఈ విషయం చెప్పాలా అని...


ఆ రాత్రి భోజనాల దగ్గర మెల్లగా విషయం కదిపాను..నాన్నా మరీ ఆయన ఫోన్ చేసారు నాన్నా , ఏవో ఇంపార్టెంట్ మొక్కులున్నాయట అన్నవరం వైజాగ్ వెళుతున్నారట అన్నాను ... ఓ మంచిదే కదమ్మా మొక్కులు తీర్చుకుంటే... వెళ్లి రానీ అన్నారు ... అది కాదునాన్న వ్రతానికి ప్రక్కన నేను ఉండాలిగా నాకూ కూడా టిక్కెట్ తీసేసారట అన్నాను మెల్లిగా ...ఏంటీ !! నిన్నా!! ఈ ఆషాడంలోనా !! నలుగురూ ఏమనుకుంటారు వొద్దొద్దు కావాలంటే వచ్చే నెల వెళ్ళండి ..అయినా ఆషాడంలో అబ్బాయి మన ఇంటికి రాకూడదు అన్నారు ... అబ్బే ఆయన రారు నాన్నా ..అమ్మమ్మ ఇంటికి వెళ్ళమన్నారు ..ట్రైన్ అక్కడ ఎక్కమన్నారు అన్నాను నన్ను ఇలాంటి పరిస్థితిలో పడేసినందుకు మా ఆయన్ని కచ్చగా తిట్టుకుంటూ ....


అప్పటి వరకూ సైలెంట్ గా మా ఇద్దరినీ చూస్తున్న అమ్మ ఒక్కసారిగా కయ్ మంది..ఏంటీ!!!! మా అమ్మ ఇంటికా !!!నేను ఒప్పుకోను...మా నాన్నకు తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా ,అసలు మా పెళ్ళిళ్ళు అయ్యేవరకూ మా నాన్నకు ముగ్గురు కూతుళ్ళు అన్న విషయం ఎవరికీ తెలియదు ..అంత గుట్టుగా పెంచారాయన... మీరిద్దరూ ఆషాడం లో ఇలా తిరుగుతున్నారంటే నాకు చీవాట్లు పడిపోతాయి తల్లీ ....పైగా మీ అత్తలు చాలు ఊరువాడా మోసేస్తారు ఈ విషయాన్ని.... అసలే వాళ్ళది పల్లెటూరు అంది ..... అందుకే ఈ సారి మీ ఆయన్ని వెళ్లి వచ్చేయమను ..తర్వాత వెళ్ళుదురుగాని అనేసి ఆ టాపిక్ మార్చేసారు ..

ఓరి భగవంతుడా ఇదేంగోలరా బాబు అని తలపట్టుకున్నాను ....సరిగ్గా ఆపధ్భాందవి లా మా అక్క ఫోన్ చేసింది .... హమ్మయ్యా అని అక్కకు చెప్పేసాను ఎలాగైనా గట్టేక్కిన్చవే అని..ఏంటీ వెళ్ళద్దు అన్నారా? మరీ వీళ్ళ చాదస్తం ఎక్కువ అయిపోతుంది..మొగుడూ పెళ్లాలేగా మీ ఇద్దరూ ... నాన్నకు ఇవ్వు ఫోన్ అంది ..హమ్మయ్యా అని నాన్నను పిలిచి నేను నిశ్చింతగా పడుకున్నాను.. పాపం మా అక్క దాదాపు ముప్పావుగంట బుర్ర తినేసి ఒప్పించేసింది .... మొత్తానికి మరుసటి రోజు బట్టలు సర్దుకుని మా నాన్న హమారా బజాజ్ స్కూటర్ ఎక్కి జాం అంటూ మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను ...కాని అక్కడే మొదలవుతుంది అసలు కధ అని అప్పటికి తెలియదు

ఈ కథ నేస్తం బ్లాగ్ లోనిది..తన అనుమతి లేకుండా పోస్ట్ చేసినందుకు మన్నించాలి
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!