రాజు గారి ముక్కుమీద
దోమ కుట్టింది,
రాజ్యంలో ప్రజకంత
హడలెత్తింది!
సామంతులు, సర్దార్లూ,
బంట్లూ, సైన్యాధిపతులు
కత్తులతో ఈటెలతో
కదనానికి లేచినారు.
కత్తులతో నరకలేక
ఈటెలతో పొడవలేక
సర్దార్లూ, సామంతులు
చలచల్లగా జారినారు
తిరిగి తిరిగి దోమ మళ్లి
రాజు కడకే వచ్చింది.
జనమంతా చూస్తుండగ
ముక్కుమీద వాలింది.
జనమంతా విస్తుపోయి
నోళ్లుతెరిచి చూస్తుంటే
బంటొక్కడు బుద్ధిశాలి
పరిగెత్తెను రాజుకడకు.
ఏమరుపాటుగా నుండిన
దోమను గురిచూసివాడు
రాజుగారి ముక్కుమీద
గురిచూసి గుద్దినాడు.
ఆ దెబ్బకు రాజుగారు
హరి హరి అని అరిచినారు
ఆ దెబ్బకు దోమగారు
హర హర మని వాలినారు.
బంటు సేవ బంటు చేవ
ప్రజలంతా మెచ్చినారు
తక్షణమే రాజతణ్ణి
తన మంత్రిగ చేసినాడు.