ఎక్కడో బ్లాగు లో చదివాను ..బాగుందని ఇక్కడ ఇస్తున్నాను ...ఈ కవితకు ఇంగ్లీషు మూలం జాన్ డన్ గారు...తెలుగు అనువాదం గోదావరి శర్మ గారు.
గొప్పవారు మరణంలో ఒప్పుకోరు ఓటమిని
రట్టులేక రభసలేక గుట్టుగానే పోతారు
బంధుమిత్రులెంతమంది చెంతచేరి గోలచేసి
వింతరీతి ఎంతఏడ్చినా వారుమటుకు వీరులే !
ఆరీతిగా నేనుకూడ వెళుతున్నానిన్నువీడి
కార్చబోకు కన్నీళ్లను విడవబోకు నిట్టూర్పులు
మనప్రేమ అనురాగం మనలోనే మననియ్యి
మనసులేని లోకానికి మనసంగతి చెప్పొద్దు
చిన్నచిన్నకష్టాలకి చిన్నబోవు లోకమిది
అత్యున్నత విషయాల్లో వ్యత్యాసం చూడలేదు
రోడ్డుమీది ట్రాఫిక్కే గడ్డు సమస్యవుతుంటే
గెలాక్సీల గమనాలని గమనించే కళ్ళేవీ ?
కళ్ళుచూసి ఒళ్ళుచూసి ప్రేమలో పడేవాళ్ళు
మనిషి దూరమవగానే ప్రేమలోంచి పడతారు
మనసుమనసుకలుపుకున్న మనమాదిరిప్రేమికులను
శరీరాలు ఎడమైనా విరహ బాధ వేదించదు
మనతనువులు రెండింటిలో మనసొకటే ఉందికనుక
కనకమొకటే ఆమనసుకు సాటివచ్చు మేటికనక
సాగుతుంది ఎడతెగక బంగారపు తీగలాగా
ఎంత మనం ఎడమైతే అంతమేర వ్యాపిస్తూ ....
అలాకాక ఇద్దరిలో ఇరుమనసులు ఉండాలని
ఎవరైనా శాసిస్తే ఎదురాడక ఔనందాం...
అద్వైతం సాధించిన ఆరెండిటి ఐక్యాన్నీ
విద్యార్ధులువాడు వృత్త లేఖినితో పోలుద్దాం
కేంద్రంలో ఉన్నకాలు ఇంటిలోని నిన్నుపోలు
పరిధివెంట పరిగెత్తే మరోకాలు నన్నుపోలు
ఏ వైపుకి నే వెళితే ఆ వైపే వొరుగుతావు
తిరిగినిన్నుచేరువేళ నిటారుగా నిలుస్తావు
నిలకడగా నువ్వుంటే నా వృత్తం చేదిరిపోదు
విరహాన్నే విరచించే నా యత్నం వృధాపోదు
వ్యాసార్ధం సున్నాచేసి నన్ను నిన్ను చేరుకోనీ
బయలుదేరు బిందువులో తిరిగివచ్చికలిసిపోనీ!