రాతిరి
చిక్కటి చీకటి అలుముకున్న మదిలో
మెదిలే ఆలోచనలు నీడలా కదిలే ఆకారాలను
తృటిలో తటిల్లున అందిపుచ్చుకుని
అంతుచిక్కని నిశ్శబ్దాన్ని పాటిస్తుంది
తెల్లారి
నిశ్శబ్దం మరింత పొడిగించబడుతుంది
పలకరింపుల ధ్యాసలేక కదిలే నిన్ను చూసి
నడిచే దారిలో ఎదురయిన వాళ్లు వీళ్లు
నీ నిశ్శబ్దాన్ని అందుకొని చిన్నబోతారు
నీలోని నిశ్శబ్ధం మెల్లి మెల్లిగా
అవతలి వాళ్లకు పంచబడుతుంది
భద్రంగా మరింత పెంచబడుతుంది...
నీవేమో
సాయంత్రానికి
స్వాంతన చిక్కిందంటూ
చిరునవ్వులు అరువు తెచ్చుకుంటావు..
అక్కడ
కాలంవడిలో నిశ్శబ్ధం
నీ చుట్టు నిగూఢంగా
తెలియని రహస్యంలా
మెల్లిమెల్లిగా చిక్కబడుతూ
మంచుతెరలా అల్లుకుంటుంది...
ఓయ్
మౌనాన్ని కుదించు...మాటలు కలుపు
నిశ్శబ్దపు లెక్కలు తేల్చు
లేదంటే
నీకు తెలియకుండా ఓ నిశ్శబ్దం
సునామీలా నిన్ను చుట్టేస్తుంది