కాలం గబగబా పరిగెత్తినట్టుంది
అందరూ తమ జీవితాన్ని పోగొట్టుకున్నట్టున్నారు
గడిచిన కాలం లెక్కలు తెలియలేదంటున్నారు
చేతిన దాగిన కాలం సంగతి అసలే మరిచారు
ఒంటరితనంమనే రాక్షసి నిశ్శబ్దంగా బయలుదేరింది
ఒక్కరొక్కరి చుట్టూ ఎతైన కోట గోడ కడుతూ ఉంది
ఎవరికి వారు పలకరింపుల కళ్లెం గట్టిగా బిగిస్తున్నారు
చిరునవ్వులంతా ఓషిబానా ఆర్టుగా మలుస్తున్నారు
బయలుదేరిన దారి ఎప్పుడో మర్చిపోయారు
ఇంతకాలం నడిచొచ్చిన దారిని చెరిపేసారు
అంతా సవ్యంగానే జరుగుతుందంటూ
నిద్రలోన ఉలిక్కి పడుతూనే ఉన్నారు..
ఇదిగో ఇప్పుడిప్పుడే
శరీరం తను అందాన్ని పోగొట్టుకుంటుంది
కళ్ళు తన మెరుపులు పోగొట్టుకుంటుంది
గొంతు అనవసరపు వాదనలు చేస్తోంది
మనసు జాడే లేదన్న అపవాదొకటి బయలుదేరింది
ఓయ్
నిక్కముగా నిజమే చెబుతున్నా
ఒక్కసారి చుట్టూ చూడకూడదూ
విసిరేసిన రంగులు ఎక్కడో చిక్కుబడే ఉంటాయి
ఒక్క అడుగు కాస్తంత అటువైపు వేయరాదు